హోమ్ /వార్తలు /national /

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నానికి కేంద్రమంత్రి ఆహ్వానం

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నానికి కేంద్రమంత్రి ఆహ్వానం

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ కేశినేని నాని (File)

నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ కేశినేని నాని (File)

విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న క‌న‌క‌దుర్గ ఫ్లైవోవ‌ర్ ప్రారంభోత్స‌వంతో పాటు ఇతర అభివృద్ధి ప‌నులు, శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాల‌లో పాల్గొనాల‌ని నితిన్ గ‌డ్క‌రీ నుంచి కేశినేని నానీకి ఆహ్వానం అందింది.

  తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానికి కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఆహ్వానం అందింది. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న క‌న‌క‌దుర్గ ఫ్లైవోవ‌ర్ ప్రారంభోత్స‌వం జరగనుంది. దీంతో పాటు జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి సంస్థ ఆధ్వ‌ర్యంలో ‌జ‌ర‌గ‌నున్న ప‌లు అభివృద్ధి ప‌నులు, శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాల‌లో పాల్గొనాల‌ని నితిన్ గ‌డ్క‌రీ నుంచి కేశినేని నానీకి ఆహ్వానం అందిన‌ట్లు ఎంపీ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అదే రోజున ‌విజయవాడ జ్యోతిమహల్ నుంచి రమేష్ హాస్పటల్ జంక్షన్ వరకు బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. వీటితో పాటు విజయవాడ బైపాస్ నిర్మాణంలో భాగంగా 16వ నంబ‌రు జాతీయ రహదారిపై గొ‌ల్లపూడి 30వ‌ కిలోమీటర్ నుంచి చినకాకాని 47.880 కిలోమీటర్ల వరకు రహదారి, కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర 6 వరుసలతో వంతెన నిర్మాణం కోసం రూ.1132 కోట్ల అంచనాతో కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు.

  2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవడం, నిధులు ఆలస్యం కావడం, తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక లాబీయింగ్‌ తో తిరిగి పనులు మొదలుకావడం, ఆ తర్వాత కరోనా కారణంగా పనులు ఆగడం, తిరిగి ఈ మధ్యే మొదలై నిర్మాణం పూర్తి కావడం జరిగాయి. దీంతో ఈ ఫ్లైఓవర్‌ ప్రతిపాదనే తమదంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెబుతున్నారు. అప్పట్లో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం సాధ్యం కాదని చెప్పిన వారే ఇప్పుడు తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని కేశినేని ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఎప్పుడో నిలిచిపోయిన పనులను తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రారంభించి పూర్తి చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓ రకంగా రెండు పార్టీలు ఈ ఫ్లై ఓవర్‌ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయి.

  కనకదుర్గ గుడిని ఆనుకుని నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం కాస్త ఆలస్యమైనా అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభతో తాజాగా పూర్తయింది. రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్‌గా పేరు తెచ్చుకున్న ఈ 2.3 కిలోమీటర్ల వంతెన నగరానికి వచ్చే సందర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంది. కృష్ణలంకలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్ నుంచి కనకదుర్గ గుడి దాటాక కుమ్మరి పాలెం సెంటర్‌ మీదుగా భవానీపురం వరకూ నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నగరంలోని సొరంగం తర్వాత విజయవాడ వాసులను అంతగా ఆకర్షిస్తోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Kesineni Nani, Nitin Gadkari, Vijayawada, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు