హోమ్ /వార్తలు /national /

VijayaShanti: హరీశ్ రావు వ్యాఖ్యలపై విజయశాంతి అనుమానాలు

VijayaShanti: హరీశ్ రావు వ్యాఖ్యలపై విజయశాంతి అనుమానాలు

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

Vijayashanti: అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ఎందుకు ఇంతగా హైరానా పడుతుందో అంతుబట్టడం లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.

  దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేశారు. హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందని ఆరోపించారు. అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని విజయశాంతి వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలను చూస్తుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారేమోనని అనుమానం కలుగుతోందని విజయశాంతి విమర్శించారు.

  అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ ఎందుకు ఇంతగా హైరానా పడుతుందో అంతుబట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు.

  అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు.

  అంతుచిక్కని విజయశాంతి మనోగతం

  ఓ వైపు టీఆర్ఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న విజయశాంతి... దుబ్బాకలో తన మద్దతు ఎవరికి అనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ... ఆమె మాత్రం కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేయాలని కోరిన దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన దాడిని ఖండించిన విజయశాంతి... ఎన్నికల తరువాత బీజేపీ గూటికి చేరుకుంటారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana, Vijayashanti

  ఉత్తమ కథలు