ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్న ఆయన.. ఈ మధ్య స్పీడ్ పెంచారు. విశాక భూ కుంభకోణం, భూ కబ్జాలు, ఆలయాలపై దాడులు ఇలా ప్రతి అంశంపై చంద్రబాబు అండ్ కో లక్ష్యంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. తాజాగా విశాఖపట్న ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ నుంచి పారిపోయి వచ్చి విశాఖలో రౌడీయిజం చేశారని ఆరోపించారు. అంతేకాదు రౌడీయిజంతో సంపాదించిన అక్రమసొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టారన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇల్లుతో పాటు, కమర్షియల్ కాంప్లెక్స్ సంపాదించారని.., బినామీల పేరుతో నాలుగు ఇళ్లు కట్టించారన్నారు.
ఇక ఒకప్పుడు విజయవాడ ఏలూరు రోడ్డులో రాగమాలిక సీడీ షాపు నిర్వహించిన వెలగపూడి రామకృష్ణ బాబుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అంతేకాదు అప్పట్లో బెజవాడలో వెలగపూడి రామకృష్ణ అంటే ఎవరికీ తెలియదని 'రాగమాలిక రామకృష్ణ' అంటే తెలుసని ఎద్దేవా చేశారు. అసలు దివంగత వంగవీటి రంగా హత్యకేసులో వెలగపూడి రామకృష్ణ నిందితుడని ఆరోపించారు. రంగా హత్యకు తన సీడీల షాపులోనే స్కెచ్ వేసి చంపారన్నారు. వంగవీటి రంగాను స్వయంగా కత్తితో పొడిచింది ఈయేనన్నారు. రంగా హత్యానంతరం విజయవాడ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడన్నారు. పోలీసుల కాళ్లు పట్టుకొని తనపై రౌడీషీట్ కొట్టేయించుకున్న సంగతి అందరికీ తెలుసని విజయసాయి అన్నారు.
వెలగపూడి రామకృష్ణ కబ్జాదారుడు కాకపోతే రిషికొండలో ప్రభుత్వం 655 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు గనుకే కోర్టుకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలో టీడీపీ నేతల హస్తముందని ఆరోపించిన ఆయన.. త్వరలోనే అందర్నీ బయటకు లాగుతామన్నారు.
ఆలయాల ధ్వంసం వారిపనే..!
రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయంలోనూ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తముందని ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడు విగ్రహం ధ్వంసంపై ప్రశ్నించగా.., చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆర్ధరాత్రి సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆలయ తాళాలు పగులగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని అతి త్వరలోనే నిజాలు బయటపెడతామన్నారు. రాష్ట్రంలో కల్లోలాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vijayasai reddy, Ysrcp