హోమ్ /వార్తలు /national /

కూటమి సీట్ల సర్దుబాటు: ఈ సాయంత్రానికి ఫైనల్ చేయనున్న ఉత్తమ్!

కూటమి సీట్ల సర్దుబాటు: ఈ సాయంత్రానికి ఫైనల్ చేయనున్న ఉత్తమ్!

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)

ఎట్టకేలకు ఈ సాయంత్రానికి సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలను ఒక్క తాటి పైకి తీసుకురావాలని ఉత్తమ్ భావిస్తున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరేముందు సీపీఐ, టీజేఎస్ పార్టీలతో ఆయన భేటీ కానున్నారు.

  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కూటమి సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. అయితే ఢిల్లీకి బయలుదేరే ముందు కూటమి పార్టీలతో భేటీ అయి.. సీట్ల లెక్కలను ఓ కొలిక్కి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు ఇప్పటికే ఆలస్యం కావడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న సీపీఐ, టీజేఎస్‌లకు ఆయన నచ్చజెప్పనున్నారు.

  ఆదివారం సాయంత్రం నుంచే వారితో సంప్రదింపులు జరుపుతున్న ఉత్తమ్.. తొందరపాటు నిర్ణయాలు వద్దంటూ వారికి సూచించారు. ఈ సాయంత్రానికి ఎట్టకేలకు సీట్ల సర్దుబాటును ఖరారు చేద్దామని వారికి హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. సీపీఐ, టీజేఎస్‌లతో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చాకే ఢిల్లీ వెళ్లాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పటికే దాదాపు పూర్తవగా.. ఇక ఈ రెండు పార్టీల లెక్కలను సెట్ చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు.

  ఇంతకుముందే ప్రకటించినట్టు కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీకి 14 సీట్లు ఇవ్వనున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి 14 సీట్లు ఇస్తే ఇక మిగిలేది 10 సీట్లే కాబట్టి.. వాటినే టీజేఎస్, సీపీఐలకు సర్దుబాటు చేయాలని భావిస్తోంది. అయితే కోదండరాం మాత్రం 10 పైచిలుకు స్థానాలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై నేడు ఉత్తమ్ కోదండరాంతో భేటీ అయి ఎలాగైనా ఆయన్ను ఒప్పించాలని చూస్తున్నారు

  సీపీఐ విషయానికొస్తే.. సీట్ల కన్నా తమకు కేటాయించే స్థానాల విషయంలో ఆ పార్టీ పట్టుదలతో ఉంది. వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్, దేవరకద్ర, ఆలేరు స్థానాలను ఆ పార్టీ కోరుతోంది. అయితే వైరా, కొత్తగూడెం మినహా మిగతా స్థానాలను సీపీఐకి కేటాయించడంపై కాంగ్రెస్ సుముఖంగా లేదు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ చైర్మన్ బాలు నాయక్‌కి దేవరకద్ర స్థానం దాదాపుగా ఖరారైందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆలేరులో కాంగ్రెస్‌కి బలమైన అభ్యర్థి భిక్షమయ్య గౌడ్ అన్నారు. ఒకవేళ భిక్షమయ్య గౌడ్‌కి టికెట్ ఇవ్వకపోతే.. నల్గొండ కాంగ్రెస్ టికెట్లన్ని కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చుకుని బీసీలను పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతాయి. కాబట్టి ఆ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదు.

  హుస్నాబాద్ నుంచి సీపీఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి టికెట్ కోరుతున్నారు. ఇందుర్తి సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డికే టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ మొగ్గుచూపుతోంది. దీంతో సీపీఐ ప్రధాన కార్యదర్శికే టికెట్ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ సీపీఐతో సీట్ల సర్దుబాటును ఎలా పరిష్కరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు ఈ సాయంత్రానికి సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలను ఒక్క తాటి పైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Congress, CPI, Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana News

  ఉత్తమ కథలు