ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇప్పటివరకు రాజకీయంగా అధికార వైసీపీనే బలంగా ఉన్నప్పటికీ... పరిస్థితి తమకు అనుకూలంగా మారకపోతుందా ? అని టీడీపీ ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలు వైసీపీ నేతలను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందనే అంశంపై ఆయన మాట్లాడారు. ఆయన పరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత దీనిపై మాట్లాడతానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అప్పుడు దీనిపై సవివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు.
అయితే ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన కామెంట్స్ ముమ్మాటికీ సరికాదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు వైసీపీకి పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించే ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్ పరిపాలనపై ఏ విధంగా స్పందిస్తారనే దానిపై వైసీపీలో టెన్షన్ నెలకొంది. నవరత్నాలు తప్ప... జగన్ పరిపాలనలో మరేమీ పెద్దగా అమలు కావడం లేదని ఉండవల్లి వ్యాఖ్యనించారు.
దీంతో మే నెల తరువాత ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్ పరిపాలనపై సానుకూలతల కంటే ఎక్కువగా పరోక్షంగా విమర్శలు చేసే అవకాశమే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే... విపక్షాలకు ఉండవల్లి వ్యాఖ్యలు సరికొత్త ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదనే భావనలో పలువురు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి జగన్ ప్రభుత్వంపై ఉండవల్లి స్వరంలో మార్పు రావడం వెనుక కారణం ఏమిటన్నది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Undavalli Arun Kumar, Ysrcp