తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం స్టాలిన్ కుమారుడు.. ఉదయనిధి స్టాలిన్..త్వరలోనే మంత్రి కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరికొద్ది వారాల్లో పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ను క్యాబినెట్‌లో సభ్యుడిగా నియమించనున్నట్లు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు.. ఇదే నిజమేనని చెబుతున్నారు. ఉదయనిధి ఇప్పటికే ప్రజాదరణ పొందారని, చాలా మంది మంత్రులు తమ శాఖ కార్యక్రమాలలో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని స్టాలిన్ సన్నిహితులు చెబుతున్నారు. “కానీ ఎమ్మెల్యే మంత్రులతో వేదిక పంచుకునే ప్రోటోకాల్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టేలా.. ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రిగా చేస్తే.. అలాంటి సమస్యలేవి ఉండవని.. అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డీఎంకే ఎమ్మెల్యేలు ఉదయ నిధికి అసెంబ్లీలో ఇచ్చే గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. చెపాక్ ఎమ్మెల్యేగా ఉదయ నిధి సభలోకి ప్రవేశించినప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు, అతని చుట్టూ ఉన్న ఇతర ఎమ్మెల్యేలు తమ సీట్ల నుండి లేచి నిలబడుతున్నారు. కేవలం ముఖ్యమంత్రి, ఉదయనిధి తండ్రి ఎంకే స్టాలిన్ వంటి మరికొందరికి మాత్రమే అలాంటి గౌరవం దక్కింది. మరోవైపు యువ నాయకుడిని మంత్రిగా చూడాలని అటు పార్టీ శ్రేణులు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. “ఇప్పటికే, ప్రస్తుత కేబినెట్‌లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి క్రౌడ్‌పుల్లర్‌ను మంత్రిని చేయడంలో తప్పు లేదు, ”అని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు మీడియాకు చెప్పారు.
పార్టీలో యువజన విభాగం ఏర్పాటైన తర్వాత 1989 నుంచి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడల్లా కనీసం ఒక్కరైనా మంత్రిగా పనిచేశారని కొందరు యువజన విభాగం కార్యకర్తలు తెలిపారు. అయితే ఈసారి యువజన విభాగం నుంచి ఎవరూ కేబినెట్‌లోకి రాలేదు. అందుకే ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రి పదవి ఇవ్వడమే సరైనదని అంటున్నారు. అందిన సమాచారం మేరకు స్టాలిన్‌కు యువజన సంక్షేమం మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా మూడు విభాగాలు ఉదయనిధి కోసం వేచి చూస్తున్నాయి.
అదే సమయంలో, డీఎంకే కార్యకర్తల్లోని ఒక వర్గం ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సభకు నాలుగోసారి ఎన్నికైనప్పుడు స్టాలిన్‌కు మంత్రి పదవి లభించిందని చెప్పారు. ఆ సమయంలో, ఆయనకు కనీసం మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నందున అది పార్టీ విజయానికి.. ఆయనకు ఎంతగానో దోహదపడిందని చెబుతున్నారు. "ఇప్పుడు, ఉదయనిధిని క్యాబినెట్ సభ్యునిగా ఎంచుకుంటే, అది పార్టీలో వంశపారంపర్య రాజకీయాల గురించి ఆరోపణలు చేసేలా ప్రతిపక్షాల ఆరోపణలకు ఆజ్యం పోస్తుంది" అని డీఎంకేకు చెందిన కొందరు కార్యనిర్వాహకులు చెబుతున్నారు. మరి సీఎం స్టాలిన్.. కుమారుడుకు మంత్రి పదవి కట్టబెడతారా లేదో తెలియాలంటే...ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
అయితే ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే.. రెండేళ్ల కిందటి నుంచే రాజకీయాల్లో బిజీగా అయ్యాడు. అంతకుముందు వరకు సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. నిర్మాతగా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో ఓకే ఓకే సినిమాతో హీరోగా మారాడు ఉదయనిధి స్టాలిన్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 13 సినిమాలు చేశాడు. అందులో దాదాపు 7 సినిమాలు హిట్ అయ్యాయి. కరుణానిధి కూడా రాజకీయాల్లోకి రాకముందు సినిమాలకు పనిచేశాడు. అప్పట్లో ఆయన దాదాపు 75 సినిమాలకు కథలు అందించాడు. తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలవడం, త్వరలోనే మంత్రి కూడా కాబోతుండటంతో ఇకపై సినిమాలకు సమయం దొరకదు అంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.