తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అంతేకాదు 5,100 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వడం, విధుల్లో చేరాలంటూ కార్మికులకు డెడ్ లైన్ విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ తొందరపాటు చర్యలు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆర్టీసీలో సగం ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడకుండా.. సానుభూతితో వ్యవహరించాలని సూచించారు కిషన్ రెడ్డి. ఆర్టీసీలో పనిచేస్తున్న పేద డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ చెరో మెట్టు దిగి.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేసే రవాణా సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు కేంద్రమంత్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, RTC Strike, Telangana, Tsrtc