తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరింది. హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని భావించిన కార్మికులు.. కేసును లేబర్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పునివ్వడంతో ఒకింత ఢీలా పడ్డారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా వద్దా? అనే విషయంలో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చివరాఖరికి సమ్మె కొనసాగింపుకే ఆర్టీసీ జేఏసీ మొగ్గుచూపింది. ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా 46 రోజులుగా సాగుతున్న సమ్మెకు ముగింపు పలికితే..
ఇన్నిరోజుల సమ్మెకు అర్థం ఉండదని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమ్మె కొనసాగింపుకు నిర్ణయం తీసుకున్నారు.
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం న్యాయవాదులతో భేటీ కానున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వులపై న్యాయ సలహా తీసుకోనున్నారు. లేబర్ కోర్టులో కేసు తుది తీర్పు రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది?.. సమ్మె కొనసాగింపు వల్ల కార్మికులకు లాభమా? నష్టమా? అన్న విషయాలను చర్చించనున్నారు. అనంతరం సమ్మెపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రానికి ఆర్టీసీ సమ్మెపై క్లారిటీ రావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, RTC Strike, Telangana, TSRTC Strike