తన సర్వేలతో ప్రజల నాడిని పసిగట్టడంతో దిట్టగా పేరు తెచ్చుకున్న విజయవాడ మాజీ ఎంపీ, ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరో సంచలనానికి తెరలేపారు. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని ఎన్నికలు జరిగే డిసెంబర్ 7న సాయంత్రం వెల్లడిస్తానని స్పష్టం చేసిన లగడపాటి...శుక్రవారం ఉదయం తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి 8 నుంచి 10 మంది ఇండిపెంటెంట్లు గెలుస్తారని స్పష్టం చేసిన లగడపాటి రాజగోపాల్... వారిలో నారాయణపేట్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి, బోథ్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నట్టు వివరించారు. ఎన్నికల్లో గెలవబోయే స్వతంత్ర్య అభ్యర్థుల పేర్లను రోజుకు ఇద్దరి చొప్పున వెల్లడిస్తానని ఆయన వ్యాఖ్యానించడంతో... ఆయన రాబోయే రోజుల్లో మరెవరు గెలవబోతున్నారని చెబుతారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఆయన చెప్పిన ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు లెక్క సంగతి ఎలా ఉన్నా... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న లగడపాటి రాజగోపాల్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో ఈ సారి 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పిన లగడపాటి... వారి సహకారం లేకుండానే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం మరో విశేషం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని ఆయన చెప్పడంతో... అందరి దృష్టి అధికార టీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై నెలకొంది. అయితే ఆయన చెప్పిన విషయాన్ని లోతుగా పరిశీలిస్తే... టీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 60 పైచిలుకు సీట్లు లేదా 45 సీట్ల లోపు వచ్చే అవకాశం ఉందని అర్థమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 60. లగడపాటి చెప్పినట్టుగా 8 నుంచి 10 సీట్లలో 8 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని అనుకుందాం. ప్రస్తుతం టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు అసెంబ్లీలో ఏడు సీట్లు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం 6 సీట్లు గెలుస్తుందని అనుకున్నా... ఇండిపెండెంట్లు, ఎంఐఎం కలిస్తే 14 అవుతుంది. వీటితో మహాకూటమికి, టీఆర్ఎస్‌కు సంబంధం లేదు. ఈ లెక్క తేలిన తరువాతే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ఏర్పడుతుందని లగడపాటి వ్యాఖ్యానించారు. అంటే అధికార తమదే అని ధీమాగా ఉన్న టీఆర్ఎస్‌కు 60కి పైగా స్థానాలు లేదా 45 సీట్లు లోపు వచ్చే అవకాశం ఉంది. ప్రజాకూటమి(కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి)కి కూడా ఇదే లెక్క వర్తిస్తుంది. ఇది తమ అంచనా మాత్రమే అని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నా... ఆయన సర్వేలు దాదాపు అన్ని సార్లు వాస్తవానికి దగ్గరగా రావడంతో... ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Mahakutami, TDP, Telangana, Telangana Election 2018, Trs