టీఆర్ఎస్ తరపున నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఎవరికి దక్కుతాయో చెప్పడం చాలా కష్టం. కేసీఆర్ మనసులో ఎవరుంటే వారికే ఆ పదవులు వరిస్తుంటాయి. తాజాగా యాదవరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్పించారు కేసీఆర్. గుత్తా ఎమ్మెల్సీగా ఎన్నికవడం దాదాపు లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. ఆయనను మంత్రివర్గంలోకి కూడా తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. గుత్తాకు కేసీఆర్ ఎమ్మెల్సీగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా... ఈ సీటును ఆశించిన ఇద్దరు నేతలు అసంతృప్తికి లోనయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సురేశ్ రెడ్డి, లోక్ సభ ఎన్నికలకు ముందు మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. దీంతో వీరికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో తన కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఓటమి కారణంగా ఈ ఇద్దరినీ కేసీఆర్ పక్కనపెట్టారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కవిత గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు అంతగా కష్టపడలేదనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కవిత ఓటమి ఎఫెక్ట్... టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు సీనియర్ నేతలకు శరాఘాతంగా మారినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Nizamabad, Trs