తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా అధికార టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు జంప్ కొట్టడం, ఇతర పార్టీల నేతలు కారెక్కడం లాంటి దృశ్యాలు అన్ని జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. కరీంనగర్ లోనైతే రెబల్స్ గెలిచేశామంటూ అప్పుడే సంబురాలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీ క్రాసింగ్స్ జరిగినా గెలుపు మాత్రం గులాబీదళానిదే అంటున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. స్థానిక ఎంపీ, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాడు పోలింగ్ జరగ్గా, వచ్చే మంగళవారం(ఈనెల 14న) ఫలితాలు వెలువడనున్నాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఐక్యంగా పనిచేశారని, గులాబీ దళమే విజయకేతనం ఎగరేస్తుందని నేతలు దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఫలితాల్లో ఎమ్మెల్సీగా తాతా మధు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని నేతలు చెప్పారు.
టీఆర్ఎస్ అంటే ఒరిజినల్ బ్రీడ్ అని, ఎన్ని క్రాసింగ్లు జరిగినా.. క్రాస్ బ్రీడ్లు వచ్చినా.. విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తాతా మధుకి వచ్చే విజయం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు. భారీ మెజార్టీ సాధిస్తాం. ఏ క్రాసింగైనా.. క్రాస్ బ్రీడ్ అయినా వస్తుంటాయ్.. పోతుంటాయి. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. టీఆర్ఎస్ అంటేనే ఒరిజినల్ బ్రీడ్..’ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్‌సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, ప్రజాకంటక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Mlc elections, Puvvada Ajay Kumar, Trs