హోమ్ /వార్తలు /national /

ఓవైపు టీఆర్ఎస్.. మరోవైపు కూటమి.. మధ్యలో 'ఏనుగు' జోష్!

ఓవైపు టీఆర్ఎస్.. మరోవైపు కూటమి.. మధ్యలో 'ఏనుగు' జోష్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కాంగ్రెస్, బీజేపీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా బీఎస్పీకి గుర్తింపు ఉంది. ఆ పార్టీ గుర్తు ఏనుగు జనాలకు సుపరిచితం కావడంతో చాలామంది రెబల్ అభ్యర్థులు బీఎస్పీ తరుపున పోటీకి ఆసక్తి చూపించారు.

  తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పోటీ చర్చలన్నీ టీఆర్ఎస్-కూటమి చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. ఎన్నికల బరిలో మరికొన్ని పార్టీలు నిలిచినా.. గతంలో అవి అంతగా ప్రభావం చూపకపోవడంతో వాటి గురించి ఎక్కడా పెద్దగా చర్చ జరగడం లేదు. అయితే కూటమిలో టికెట్ దక్కని కొంతమంది కీలక నేతలు బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో బీఎస్పీ కూడా అక్కడక్కడా తళుక్కుమంటోంది.

  టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి వినోద్ ఈసారి బీఎస్పీ తరుపున బెల్లంపల్లి బరిలో నిలిచారు. అలాగే గతంలో టీఆర్ఎస్ తరుపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి.. ఈసారి టికెట్ దక్కించుకోవడంలో విఫలమైన మన్నె గోవర్దన్ రెడ్డి కూడా బీఎస్పీలో చేరారు. ఖైరతాబాద్ నుంచి బీఎస్పీ తరుపున ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బలమైన అభ్యర్థిగా పేరున్న రాజారపు ప్రతాప్.. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరుపున నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నారు.ఇక కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రావి శ్రీనివాస్.. సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇబ్రహీంపట్నం నుంచి మొదట కాంగ్రెస్ మద్దతు దొరకని మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో.. హస్తం బలపరిచిన బీఎస్పీ అభ్యర్థిగా అక్కడినుంచి పోటీ చేస్తున్నారు.

  కాగా, దేశంలో కాంగ్రెస్, బీజేపీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా బీఎస్పీకి గుర్తింపు ఉంది. ఆ పార్టీ గుర్తు ఏనుగు జనాలకు సుపరిచితం కావడంతో చాలామంది రెబల్ అభ్యర్థులు బీఎస్పీ తరుపున పోటీకి ఆసక్తి చూపించారు. గత 2014 ఎన్నికల్లో బీఎస్పీ నిర్మల్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత చాలామంది అభ్యర్థులకు బీఎస్పీ ఆశాజనకంగా కనిపిస్తోంది.

  ఈ నేపథ్యంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం తెలంగాణలో ప్రచారానికి వస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28వ తేదీన మాయావతి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మాయావతి రాక తెలంగాణ బీఎస్పీకి బిగ్ బూస్టింగ్ ఇస్తుందని ఆ పార్టీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ.. ఏ మేరకు తన ప్రభావం చూపించగలదన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Bsp, Mayawati, Telangana, Telangana Election 2018

  ఉత్తమ కథలు