తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తల ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బయటకువెళ్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరవింద్ తన కారులో వెళ్తున్న సమయంలో అడ్డుకోబోయారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ కాన్వాయ్ మీద దాడి చేశారు. బీజేపీ ఆఫీసులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నిచారు. బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. తోపులాటకు దిగారు. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
టీఆర్ఎస్లో ఉన్న కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు తనపై దాడిగి తెగబడ్డాయని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. హైవే మీద వాహనాల్లో తన వాహనాన్ని వెంబడించారని ఆరోపించారు. ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ సిగ్గు పడాల్సిన విషయమని అరవింద్ అన్నారు.
ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. బీజేపీపై దాడులకు పాల్పడితే సరైన సమాధానం చెబుతామని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సంజయ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Nizamabad, Telangana, Telangana bjp, Trs