హోమ్ /వార్తలు /national /

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

    దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ‘‘సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసం. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాం.’’ అని కేసీఆర్ ప్రకటించారు.

    దుబ్బాకలో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ రావును ఆ పార్టీ ఖరారు చేసింది. కొన్ని రోజులుగా ఊరూరు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు రఘునందన్ రావు. ఇక టీఆర్ఎస్ నుంచి సుజాత పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్ఠానానికి ప్రతిపాదించాలని ఆదివారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఏఐసీసీకి నర్సారెడ్డి పేరును మాత్రమే పంపించినట్లు సమాచారం. నర్సారెడ్డితో పాటు శ్రవణ్ ‌కుమార్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డిల పేర్లకు కూడా చర్చకు వచ్చాయి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మెజారిటీ నేతలు నర్సారెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గుచూపారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

    దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పార్టీల ప్రచారం కూడా ఊపందుకుంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dubbaka By Elections 2020, Telangana, Trs

    ఉత్తమ కథలు