హోమ్ /వార్తలు /national /

దుబ్బాకలో టీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ నేతల ప్రచారం.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు

దుబ్బాకలో టీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ నేతల ప్రచారం.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు

డీకే అరుణ(ఫైల్ ఫొటో)

డీకే అరుణ(ఫైల్ ఫొటో)

మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోదీ.. రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

  తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికల వేడి రాజుకుంది. దుబ్బాకలో మళ్లీ గెలిచి తమకు తిరుగులేదని నిరూపించేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి.. సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇవ్వాలని ఇటు బీజేపీ, అటూ కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు నేతలు. ఇందులో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక, గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పనిచేయబోతున్నాయని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు డీకే అరుణ.

  రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో గ్రూప్‌లకు, వర్గాలకు తావు లేదని ఆమె అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కట్టలేని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు లేదని మండిపడ్డారు. బీజేపీ అంటే భయంతోనే ఆయన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శలు గుప్పించారు డీకే అరుణ. కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చిందని... తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి రానందుకు నిరాశ చెందలేదన్న అరుణ.. జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.

  మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోదీ.. రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తెచ్చే ప్రతీ ఆర్డినెన్స్, చట్టం, రూల్ కు అనుకూలంగా టీఆర్ఎస్ అనుకూలంగా ఓట్లు వేసిందని.. ప్రతీ విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. రైతు బిల్లులకు టీఆర్ఎస్ అడ్డుచెప్పడంలో చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఉత్తమ్.

  కాగా, బీజేపీ జాతీయ నాయకత్వం ఇటీవల పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ... తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఇక ఏపీకి చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఆమెకు చోటు కల్పించింది. ఇక ఏపీకి చెందిన సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కగా... తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన లక్ష్మణ్‌ను బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: DK Aruna, Dubbaka By Elections 2020, Telangana, Telangana bjp, Trs, TS Congress

  ఉత్తమ కథలు