తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక.. కేసీఆర్ పేరు ఎంత మారుమ్రోగిందో.. టీపీసీసీ అధికార ప్రతినిధి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు కూడా సోషల్ మీడియాలో అంతే మ్రోగిపోయింది. కేసీఆర్ స్థాయి నేత కాకపోయినా.. ఆయన వ్యాఖ్యలతో, చాలెంజ్‌లతో అదే రేంజ్లో పబ్లిసిటీ కొట్టేశారాయన. సినిమాలు మొదలు రాజకీయాల వరకు ఆయన వ్యవహారశైలి భిన్నంగా, వివాదాస్పదంగా ఉంటుంది. ఇక, తెలంగాణలో ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బండ్లగణేశ్.. తెగ హడావిడి చేసేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ సవాళ్లు విసిరారు. దీంతో మీడియాతో సహా సోషల్ మీడియాలో చాలా ఫేమస్సయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ పెద్ద సవాలే విసిరారు. పెద్ద పెద్ద సవాళ్లు విసిరిన బండ్ల గణేశ్.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పత్తాలేకుండా పోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం.. ఆయన పేరు మీద 7 ఓ క్లాక్ బ్లేడుకు భలే ప్రచారాన్ని కల్పించేశారు. కాంగ్రెస్ ఓడిపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేశ్ ఎక్కడున్నాడంటూ.. పోస్టుల మీద పోస్టులు పెట్టేశారు. సర్వేలు చెప్పిన లగడపాటితో సమానంగా బండ్ల గణేశ్ కోసం ఆరాతీయడం మొదలెట్టారు.
దాదాపు వారం రోజులుగా గణేశ్ ఎవరి కంటా పడలేదు. ఎట్టకేలకు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన బండ్లగణేశ్ మీడియా ప్రతినిధులకు దొరికిపోయారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకు నాలుక మడత పెట్టేశారు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పిన బండ్ల గణేశ్.. తాను అజ్ఞాతంలో లేనని, పార్టీ ఓడిపోయిందనే బాధలో ఉన్నానన్నారు. ‘‘ ఆవేశంలో అలా అన్నాను. మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోష్ తీసుకొచ్చేందుకు, విశ్వాసాన్ని నింపేందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న మాట నిజమే. అయితే, అవి ఆవేశంలో అన్నమాటలు. వంద మాటలు అంటాం. అంత మాత్రాన కోసేసుకుంటామా? ఎవరెవరో ఏదేదో అంటారు. అన్నీ చేసేస్తున్నారా? మీడియా వాళ్లు చెబితే కోసుకుంటా.’’ అంటూ సింపుల్‌గా సైడైపోయారు.
ఎన్నికల ముంగిట రాహుల్ గాంధీతో కండువా కప్పించుకొని కాంగ్రెస్‌లో చేరిపోయిన బండ్ల గణేశ్.. పలు మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ తరుచూ వార్తల్లో నిలిచారు. రెండు మూడు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించేశారు. రాసిపెట్టుకోండంటూ మీడియా ప్రతినిధులకు సైతం చాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో.. ఆయన పత్తా లేకుండాపోయారు. ‘‘బండ్ల గణేశ్ ఆచూకీ ఎక్కడ’’అంటూ మళ్లీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. ఇన్నాళ్లకు తిరుమలలో మీడియాకు చిక్కిన బండ్ల గణేశ్.. తన వ్యాఖ్యలపై నాలుక మడతెట్టేశారు. ఏదో ఆవేశంలో అలా అన్నానంటూ మెల్లగా జారుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, CM KCR, Congress, Telangana, Telangana Election 2018, Telangana News, Tirumala Temple