తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని డీఎస్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆయనతో ముచ్చటించారు. చేతికి గాయమైన ఆయనను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎస్ తనకు చాలా దగ్గరి మనిషని.. అందుకే పలకరించడానికి వెళ్లినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని డీఎస్ అన్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని డీఎస్ చెప్పారు. రేవంత్ తన కోసం ఇంటికి వచ్చి పలకరించడం అభినందనీయమని అన్నారు. ఇక, ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని బయటకు చెబుతున్నప్పటికీ.. ఇరువురు నేతల మధ్య ప్రస్తుత రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక, రాజ్యసభ సభ్యుడు డీఎస్.. సోమవారం ఇంట్లో జారిపడ్డారు. తన ఇంట్లోని పూజ గది నుంచి బయటకు వస్తుండగా.. ఆయన కింద పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు భుజానికి ఫ్రాక్చర్ అయినట్టుగా తేల్చారు. దీంతో ఆపరేషన్ నిర్వహించారు. చికిత్స అనంతరం ఆయనను ఇంటికి తీసుకొచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు అంటిముట్టనట్టుగా డీఎస్..
కాంగ్రెస్‌లో (Congress Party) కీలక నేతగా ఎదిగిన డీఎస్.. రెండు సార్లు పీసీసీ బాధ్యతలు నిర్వహించారు. 2004లో ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం అందింది. మరోవైపు కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన డీఎస్.. హస్తం పార్టీని వీడి కారెక్కారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే డీఎస్ తీరుపై నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నేతలు టీఆర్‌ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయిందని చెబుతారు. ఇక, అప్పటి నుంచి డీఎస్ టీఆర్‌ఎస్ పార్టీకి (TRS Party) అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Sad: ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు.. కలిసి ఉంటూనే మనసులో ఎంత పగ.. ఇంటర్నెట్‌లో వెతికి మరి..
మరోవైపు 2019 సాధారణ ఎన్నికల్లో డీఎస్ కొడుకు అరవింద్ (Dharmapuri Arvind) నిజమాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ కూతరు కవితపై విజయం సాధించారు. ఆ తర్వాత డీఎస్.. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత డీఎస్.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని కూడా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యునిగానే ఉన్న డీఎస్.. ఆ పార్టీతో సంబంధాలు లేవనే చెప్పాలి.
ఇక, రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతుల చేపట్టిన తర్వాత నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, మరోవైపు గతంలో కాంగ్రెస్‌ను వీడిన కొందరు నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay), రేవంత్ రెడ్డి గతంలో సమావేశం కూడా అయ్యారు. అయితే సంజయ్ కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. నిజామాబాద్‌కు చెందిన కొందరు నేతలు మాత్రం సంజయ్ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు కూడా పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్.. డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, D Srinivas, Revanth Reddy