హోమ్ /వార్తలు /national /

Tirupati Loksabha By Poll - Nagarjuna Sagar By Poll: నేటి నుంచే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ.. వేగం పెంచిన పార్టీలు..

Tirupati Loksabha By Poll - Nagarjuna Sagar By Poll: నేటి నుంచే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ.. వేగం పెంచిన పార్టీలు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి, తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారంలో మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.

  తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి తెలంగాణలోని నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తర్వాత మార్చి 31న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో.. బరిలో నిలిచే ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో మరింత వేగాన్ని పెంచనున్నాయి. పీలో అధికార వైసీపీ.. తిరుపతి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు నాగార్జున సాగర్‌లో పర్యటిస్తున్నారు.

  నాగార్జున సాగర్‌లో పరిస్థితులు..

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. నాగార్జునసాగర్‌లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఆ ఊపుతో ముందుకు సాగాలని భావిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకునే విధంగా సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తరఫున దివంగత నోముమ నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను బరిలో నిలుపుతుందా?.. లేక మరేవరికైనా అవకాశం ఇస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

  మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా నాగార్జున సాగర్ సీటుపై గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనారెడ్డిని బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న జనారెడ్డి.. ఈ నెల 29న నామినేషన్ వేయనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే గిరిజన భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ.. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే.. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

  తిరుపతిలో పరిస్థితులు..

  తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ గతేడాది సెప్టెంబరు 16న మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌కు ముందు నుంచే తిరుపతిలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. నోటిఫికేషన్ వెలువడక ముందే టీడీపీ.. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని టీడీపీ తరఫున బరిలో నిలపనున్నారు. 2019 టీడీపీ తరపున పోటీ చేసిన పనబాక లక్ష్మి ఓటమిపాలయ్యారు. ఇక, సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకుండా ఉండేందుకు వైసీపీ కూడా భారీగా ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న వైసీపీ.. విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే తమ పార్టీ తరఫున డాక్టర్.ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేసింది. గురుమూర్తి విషయానికి వస్తే..జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి పనిచేశారు.

  ఇక, తిరుపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరేది ఉత్కంఠగా మారింది. ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుంచి లోకసభ కు పోటీ కిఅవకాశం కోసం కసరత్తు చేస్తున్నముగ్గురు మాజీ ఐఏఎస్ ల కుర్చీలాటకి తెరపడింది. టికెట్ ఆశిస్తున్న దాసరికి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తమకు ఉప ఎన్నికలో పోటీ కి అవకాశం పోటీపడ్డారు. ఐతే ఆదివారం ప్రకటించిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కమిటీ సభ్యులుగా దాసరి శ్రీనివాసులుతోపాటు రావెల కిషోర్ బాబు కి ప్రచార బాథ్యతలు అప్పగించటం తో దీంతో ఇప్పుడు రేసులో రత్నప్రభ ఒక్కరే నిలిచినట్లయింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, Nagarjuna Sagar By-election, Telangana, Tirupati Loksabha by-poll

  ఉత్తమ కథలు