2019 పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ సానుకూల ఫలితాలు సాధించి జోష్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో పాగా వేసిన హస్తం పార్టీ.. పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీకి కీలకంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తస్‌గఢ్ రాష్ట్రాల్లో.. కమల దళాన్ని నిలువరించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకుంటోంది. 2014 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఇదో పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. చాన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ గెలుపుకళతో మెరిసిపోతోందంటున్నాయి రాజకీయవర్గాలు. కాంగ్రెస్‌కు అచ్చేదిన్ వచ్చినట్టేననే అభిప్రాయం వినబడుతోంది. పార్టీ బాధ్యతలు చేపట్టాక రాహుల్ గాంధీకి కూడా ఇదే పెద్ద విజయం. దీంతో ఆయన శక్తి సామర్థ్యాలపై పార్టీ శ్రేణులకు నమ్మకం మరింత పెరిగిపోయింది. రాహుల్ కూడా సమర్థ ప్రతిపక్షనాయకుడిగా.. అధికార పక్షం ముందు నిలబడగలిగారు.
2014 సాధారణ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత జరిగిన చాలా ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలనే సాధించి జవసత్వాలను కోల్పోయింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమవుతూ వస్తోంది. బీహాఆర్‌లో కూటమి కట్టి విజయం సాధించినా అది ఆర్జేడీ, జేడీయూ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత గుజరాత్‌లో పోరాడినా.. విజయానికి దూరంలోనే నిలిచిపోయింది. కర్నాకటలోనూ అధికారాన్ని నిలబెట్టుకోలేక.. తమ కన్నా తక్కువ సీట్లున్న జేడీఎస్‌కు సీఎం కుర్చీని అప్పగించింది. అలా కర్నాటక కూడా తమ హస్తాల్లోనే ఉందని చెప్పుకోగలిగింది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించింది. అయితే తెలంగాణలో ఘోర ఓటమి ఎదురైనా, మిజోరంలో ఓటమితో ఈశాన్యం నుంచి ఊడ్చేసినట్టయినా.. హస్తం పార్టీకి ఆ మూడు రాష్ట్రాల గెలుపు భారీ ఊరడింపును ఇచ్చింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు పార్టీ శ్రేణుల్లో బోలెడంత విశ్వాసాన్ని నింపింది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు! కాంగ్రెస్‌లో గెలుపుకళ ఉట్టిపడుతోంది. ఒకేరోజు, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయి. డిసెంబర్ 17న ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ కమల్‌నాథ్, చత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బాగల్.. ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు.
ఈ వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ సహా ప్రముఖ నేతలందరూ హాజరు కాబోతున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్న సమయమిది. 20కి పైగా రాష్ట్రాల్లో పాగా వేసిన కమలదళం.. మరికొన్ని రోజుల్లో అన్ని రాష్ట్రాలనూ తమ ఖతాలో వేసుకోవాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి తరుణంలో మూడు రాష్ట్రాలను.. బీజేపీ నుంచి సొంతం చేసుకున్న హస్తం పార్టీ.. మంచి జోష్‌ను సంపాదించింది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శక్తిసామర్థ్యాలపై నమ్మకాన్ని అమాంతం పెంచేసిందనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే ఉత్సాహంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. మరి హస్తం జోరు ఇలాగే కొనసాగుతుందో? లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Ashok Gehlet, Bjp, Gujarat, Kamal Nath, Karnataka, Madhya pradesh, Mizoram, Rahul Gandhi, Rajasthan, Telangana, Telangana Election 2018