హోమ్ /వార్తలు /national /

Pawan Kalyan: శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత

Pawan Kalyan: శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, రైతులతో మాట్లాడుతున్న జనసేనాని (Image; Janasena Party/Twitter)

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, రైతులతో మాట్లాడుతున్న జనసేనాని (Image; Janasena Party/Twitter)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తొట్టంబెడు మండలం, పొయ్యగ్రామంలో ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో పొయ్య గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్న సమయంలో ఈ టెన్షన్ నెలకొంది. నివర్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ఐదు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటన కొనసాగింది. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పవన్ పర్యటించనున్నారు. రేపు కూడా పవన్ పర్యటన కొనసాగనుంది. ఏపీలో ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా రాయలసీమలోని చిత్తూరు, కోస్తాంధ్రలోని నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు బాగా నష్టపోయాయి. దీంతో రైతులను ఆదుకోవాలని కోరుతూ, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపట్టారు. డిసెంబర్ 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. అక్కడ పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 3న చిత్తూరులో పవన్ పర్యటించారు. అక్కడ జనసేన నేతలతో సమావేశమై పంట నష్టం లెక్కలను తెలుసుకున్నారు.

పంటలు నష్టపోయిన రైతులకు కనీసం రూ.25వేల నుంచి రూ.30వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అత్యవసరంగా కనీసం రూ.10వేల సాయం అందించాలని కోరారు. రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం అని చెప్పారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు ‘జై కిసాన్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. పంట నష్టాల వల్ల నలుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు ఆగాలంటే వెంటనే ప్రభుత్వం రూ.10వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యలను విస్మరించడమే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమని పవన్ కళ్యాణ్ భావించారు.


మరోవైపు డిసెంబర్ 15 వరకు ఎన్యూమరేషన్ పూర్తి చేసి డిసెంబర్ 31న రైతులకు పంటల బీమా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. పంట నష్టం జరిగి నెలా, రెండు నెలల్లోనే రైతులకు బీమా సొమ్ము చెల్లించేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గతం టీడీపీ ప్రభుత్వంలా కాకుండా తాము వెనువెంటనే బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Cyclone Nivar, Janasena party, Pawan kalyan, Ysrcp