ఆంద్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కోసం ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో మిగిలిన పార్టీల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ఈనెల 17 నుంచి ప్రచారం ప్రారంభించాలని పార్టీ కేడర్ ను చంద్రబాబు ఆదేశించారు. అదే రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతిలో టీడీపీ ఆఫీస్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పార్టీ గెలుపు కోసం అనుచరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 9,10,11 తేదీల్లో నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఇక తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ కు ఇన్ ఛార్జ్ ను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని బాబు స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీని పట్టించుకోకుంటే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీనియర్ నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర లాంటి ముఖ్యనేతల నేతృత్వంలో 97 మంది నేతలతో ప్రత్యేక బృందాన్ని తిరుపతి ఉప ఎన్నిక కోసం రంగంలోకి దించనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఈ కమిటీలోని నేతలంతా నోటిఫికెషన్ వెలువడగానే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు.
అలాగే బూత్ స్థాయిలో 8వేల మంది కార్యకర్తలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. వీరు చేసే ప్రచార కార్యకలాపాలన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ నుంచి జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది పార్టీ అధిష్టానం. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో లోపాలు, నిత్యావసర ధరలు, మధ్యం మాఫియా, ఇసుక పాలసీ, ఆలయాలపై దాడులు, రోడ్ల సమస్యలు, ఎస్సీలపై దాడులు లాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు బాబు తెలిపారు. 16 శాసనసభ నియోజకవర్గాల్లో బాధ్యులను నియమించాల్సి ఉండగా.. మరో 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు సమర్థవంతగా పనిచేయట్లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 47 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను ఆయన ఆదేశించారు. ఇప్పటికీ హిందూత్వ నినాదం ఎత్తుకున్న టీడీపీ., ధర్మ పరిరక్షణ యాత్రపేరుతో చేపడుతున్న ప్రచారం ఎంతవరకు వర్కవుట్ అవుతందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.