హోమ్ /వార్తలు /national /

కేసీఆర్ ఆశలు ఆవిరి... టీఆర్ఎస్‌కు 8 సీట్లే... పుంజుకున్న కాంగ్రెస్, బీజేపీ

కేసీఆర్ ఆశలు ఆవిరి... టీఆర్ఎస్‌కు 8 సీట్లే... పుంజుకున్న కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

Telangana lok sabha election results 2019 | ఎంఐఎంతో కలుపుకుని కచ్చితంగా 15 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్‌కు వాస్తవ ఫలితాలు అనుకోని విధంగా షాక్ ఇచ్చాయి. మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి.

ఇంకా చదవండి ...

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని స్థాయిలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల్లో అదే రకమైన ఫలితాలు వస్తాయని బలంగా నమ్మింది. ఎంఐఎంతో కలుపుకుని కచ్చితంగా 15 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్‌కు వాస్తవ ఫలితాలు అనుకోని విధంగా షాక్ ఇచ్చాయి. మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ చేరో స్థానం గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసుకున్న టీఆర్ఎస్ అంచనాలు పూర్తిగా తప్పాయి. మల్కాజ్‌గిరి, చేవేళ్ల, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో టీఆర్ఎస్‌తో హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్... ఈ నాలుగు స్థానాల్లో విజయం సాధించి గులాబీ శ్రేణులకు షాక్ ఇచ్చింది.


  టీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో 6 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవేళ్ల నుంచి విజయం సాధించగా, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ నుంచి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. ఇక అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదే అని టీఆర్ఎస్ భావించిన అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి.


  అదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్‌లో బండి సంజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవితపై బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలవడం టీఆర్ఎస్‌కు మింగుడు పడటం లేదు. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవడంతో... రాజకీయంగా టీఆర్ఎస్‌కు సవాళ్లు ఎదురుకానున్నాయనే ప్రచారం జరుగుతోంది.

  First published:

  Tags: Bjp, CM KCR, Congress, Revanth reddy, Telangana Lok Sabha Elections 2019, Trs

  ఉత్తమ కథలు