తాను ఎవరినైనా బెదిరించి డబ్బులు అడిగినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. తాను ఓ రియల్టర్‌ను డబ్బులు అడిగినట్టు ప్రచారంలో ఉన్న ఆడియో టేపు అంశంపై ఆయన స్పందించారు. ఇది కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారామని ఆయన అన్నారు. తాను డబ్బులు వసూలు చేసినట్టు ఎవరితో అయినా చెప్పిస్తే.. లేక అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించినా వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తనకు పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయని.. వందల ఎకరాల భూమి ఉందని అన్నారు. అలాంటి తనకు ఈ రకంగా డబ్బులు వసూలు చేసే అవసరం ఏముంటుందని వ్యాఖ్యానించారు.
కొద్దిరోజుల క్రితం కూడా తన గురించి ఇలాంటి ఓ ఆడియో వ్యవహారం ప్రచారంలో వచ్చిందని గుర్తు చేసిన మల్లారెడ్డి.. తానంటే గిట్టని కొందరు ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆడియో టేపు ఏ రకంగా ప్రచారంలోకి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చే పనిని తాను ఎఫ్పుడూ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు తన నియోజకవర్గం పరిధిలో వెంచర్ వేసిన రియల్టర్‌ను ఫోన్ కాల్ ద్వారా మంత్రి మల్లారెడ్డి బెదిరించినట్టు ఓ ఆడియో తెగ వైరల్ అవుతోంది. స్థానిక సర్పంచ్‌తో మాట్లాడి తాను వెంచర్ వేసినట్టు సదరు రియల్టర్ చెప్పగా... సర్పంచ్‌తో మాట్లాడితే సరిపోదని.. తన సంగతేంటని మంత్రి మల్లారెడ్డి అన్నట్టు ఆ ఆడియోలో ఉంది. తనను కలిసేంతవరకు ఆ వెంచర్ పనులు ఆపేయాలని ఆయన అన్నట్టు అందులో ఉంది. దీనిపై స్పందించిన మల్లారెడ్డి.. ఈ ఆడియో టేపులో వాస్తవం లేదని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malla Reddy, Telangana