ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేకుంటే తెలంగాణ (Telangana)లో 24 గంటల విద్యుత్ (Electricity) ఉండేదా? ఇంటింటికి మంచినీరు అందేదా? అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ (Gujarat) లో దారిద్య్ర రేఖ మరింత పెరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. మోదీ పాలనలో దళారులు కుబేరులయ్యారు. దేశం దివాళా తీసిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల లింగయ్య యాదవ్ అభినందన సభలో ముఖ్య అతిధిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం కల సాకారం చేసిన నేత అని.. సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడని చెప్పుకొచ్చారు.
సంక్షేమం, అభివృద్ధి లో పరుగులు..
పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని మంత్రి జగదీశ్ మండిపడ్డారు. కేసీఆర్ (KCR) మీద, ఆయన కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రం తెలంగాణ అని.. అయినా సంక్షేమం, అభివృద్ధి లో పరుగులు పెడుతున్న రాష్ట్రం అని ఆయన అన్నారు.
సొంత పార్టీకి నాయకుడు ఎవరో తెలియని పార్టీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిప్పులాంటి వ్యక్తి అని.. ఆయన్ని ముట్టుకుంటే భస్మం అవుతారని మంత్రి జగదీశ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) దిక్కు మొక్కు లేదు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలీదని మంత్రి జగదీశ్ ఎద్దేవా చేశారు. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదని మంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు జగదీశ్. మాదంతా పారదర్శకమే. మ్యానిఫెస్టోను ఉన్నది ఉన్నట్లు అమలు పరిచిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి అన్నారు. ఎక్కడ చర్చకైనా గులాబీ శ్రేణులు సిద్ధమేనన్నారు. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఏడేళ్లలో 75% పూర్తి చేసి చూపించిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు మంత్రి జగదీశ్.
టీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువని, అటువంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవం అన్నారు మంత్రి. నిబద్ధతే గుర్తింపు నిస్తుందని తెలిపారు. ఆ నిబద్ధత తోటే బడుగులకు పదవులని చెప్పుకొచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి.
ఊహించని విధంగా..
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేయని టీఆర్ఎస్.. అసలు ఈ పదవులను భర్తీ చేయాలా ? వద్దా ? అనే అంశంపై కొంతకాలం తర్జనభర్జన పడింది. జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తామని కొంతకాలం క్రితం ప్రకటించినా.. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో గులాబీ బాస్ ఈ విషయంలో వెనక్కి తగ్గారేమో అని చాలామంది భావించారు. కానీ ఉన్నట్టుండి టీఆర్ఎస్ నాయకత్వం జిల్లా అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చింది. కొన్ని చోట్ల ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లకు కూడా అవకాశం కల్పించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Suryapet, Telangana, Telangana Politics, TRS leaders