బీజేపీ (BJP) బెదిరింపులకు బయపడేపార్టీ కాదని, కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) శుక్రవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీంతో శనివారం తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister harish rao) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డి దారిన ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయ్యారని విమర్శలు గుప్పించారు.
వ్యాపంలో ఎంతమందికి శిక్ష పడింది..?
సిద్దిపేటలో హరీశ్‌రావు (Harish rao) మీడియాతో మాట్లాడుతూ... "శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చవాకులు పేలారు. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్ సింగ్ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నటు ఉంది. శివరాజ్‌సింగ్‌కు తెరాసను, కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొని శివరాజ్‌సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదు. ఏ రంగంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించింది? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి? కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పింది" అని హరీశ్‌రావు అన్నారు. ‘‘వ్యాపం కుంభకోణంలో ఎంతమందికి శిక్ష పడింది, ఎంతమంది అదృశ్యమైపోయారు. మీ కుటుంబ సభ్యుల మీద అందరిపై ఆరోపణలు వచ్చాయి ఆ కేసు ఏమైంది’’ అని హరీశ్ ప్రశ్నించారు.
బీజేపీ నాటకాలు ఆడుతోంది..
జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ నాయకులు ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిన్న హైదరాబాద్‌లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు.
నోటిఫికేషన్లు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటోంది..
కేంద్ర ప్రభుత్వ 14 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే భాజపా అడ్డుకుంటోదని హరీశ్‌రావు ఆరోపించారు. అవినీతిపై శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
శివరాజ్‌సింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో తెరాస మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో తలసాని శ్రీనివాసయాదవ్ కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. " సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పోలికే లేదు. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్ సీఎం అయ్యారు. ప్రధాని, భాజపా సీఎంలు.. కేసీఆర్ ప్రశంసించలేదా? భాజపా నేతలకు ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉందా? తెలంగాణ మాదిరిగా భాజపా పాలిత ప్రాంతాల్లో జీతభత్యాలు ఇస్తున్నారా? " అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Politics, Shivraj Singh Chouhan, Siddipet, Trs