(వేణు యాదవ్, కరీంనగర్ కరస్పాండెంట్ న్యూస్ 18)
తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గలలో కరీంనగర్ ఒకటి. ఈసారి ఇక్కడి సిట్టింగ్ ఎంపీ వినోద్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే అటు వినోద్ మాత్రం తన గెలుపుపై ధీమాగానే ఉన్నారు. వినోద్ మాత్రమే కాదు, బీజేపీ సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా ఈసారి గెలుపు తమదే అంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరనుందన్నది ఆసక్తకిరంగా మారింది.
ప్రజల్లో వినోద్ కుమార్ పై వ్యతిరేకత
మొదట్లో త్రిముఖ పోటి నెలకొన్నా.. పోలింగ్ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా బీజేపి వర్సెస్ టీఆర్ఎస్‌గా పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎవరో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేసినా.. వినోద్ కుమార్‌కు సంజయ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈసారి ఆయన గెలుపు అంత సులువేమి కాదంటున్నారు. ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేయడం.. మిగతా వారిని చిన్నచూపు చూడటం.. నేరుగా కలిసే అవకాశం ప్రజలకు లేకపోవడం లాంటి అంశాలు వినోద్‌కు ప్రతికూలంగలా మారవచ్చునని అంటున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, కరీంనగర్‌కు స్థానికేతరుడైన వినోద్ కుమార్ ఇక్కడ ఆధిపత్యం చలాయించడం స్థానిక నాయకులను వేధిస్తున్న ప్రధాన సమస్యగా తయారైందన్న విమర్శ కూడా ఉంది. ఆఫ్ ది రికార్ఢ్ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో బీజేపికి మద్దతు తెలుపుతున్నట్లు వదంతులు కూడా వచ్చాయి. ఇవన్నీ వినోద్‌పై ప్రతికూలంగా పనిచేస్తే బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు.
(కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్..)
కరీంనగర్ నియోజకవర్గంలో గత మూడు నెలల క్రింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 7.96 శాతం తగ్గి 60.04 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇందులో మెజారిటీ ప్రజలు టీఆర్ఎస్, బీజేపీలకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. అయితే హరీశ్ రావు స్వగ్రామం తోటపల్లిలో నిర్వహించిన ప్రచారంలో.. వినోద్ కుమార్ హరీశ్ రావు పేరు కూడా ప్రస్తావించకపోవడం.. కరపత్రాలలో ఆయన ఫోటో కూడా లేకపోవడంతో గ్రామస్తులు ఆయనపై వ్యతిరేకత ఏర్పరుచుకున్నట్టు చెబుతున్నారు. దీంతో వారంతా బీజేపీ అభ్యర్థి సంజయ్‌కు ఓటు వేసి తమ వ్యతిరేకతను చాటుకునే అవకాశం ఉందంటున్నారు.
(కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్..)
కమలానికి కలిసి వచ్చే అంశాలు
కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్న బండి సంజయ్.. 2014, 2018లో కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో స్వల్ప ఓట్ల తేడాతో ద్వీతియ స్థానంలో నిలిచాడు. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని తిరిగి సంజయ్‌కే ఆ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోవడంతో ప్రజల సానుభూతి కూడా ఆయనకు తోడైంది. కరీంనగర్‌లో మార్చి 24న జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ హిందువులపై చేసిన వాఖ్యలు సంజయ్‌కి ఆయుధంగా మారాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు విజయ సంకల్పయాత్ర పేరుతో చేసిన ర్యాలీ సందర్భంగా సంజయ్ ఆస్వస్థతకు గురికావడంతో ప్రజల్లో ఆయనపై సానుభూతి మరింత పెరిగింది. సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సామాజిక వర్గం ఒకటే కావడంతో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలిపోయాయి. ఇప్పుడు సంజయ్ ఎంపీ బరిలో నిలవడంతో.. ఆ సామాజికవర్గమంతా ఆయనకే ఓటేసిందంటున్నారు. సామాన్య ఓటర్లు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓట్లు వేసినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Karimnagar S29p03, Lok Sabha Election 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Trs