హోమ్ /వార్తలు /national /

KCR Letter: నదీజలాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం, అది జగన్ ఎత్తుగడ అంటూ..

KCR Letter: నదీజలాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం, అది జగన్ ఎత్తుగడ అంటూ..

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు.

  కృష్ణా - గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు భారీ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి వివరాలను పొందుపరిచారు. అత్యున్నత స్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సహజ న్యాయంతో కూడిన ధర్మసూత్రాలను అనుసరించి 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునః పరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపడుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు.

  అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద నివేదించాలని ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు సీఎం కేసీఆర్ లేఖ

  పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఏం చేస్తున్నదని లేఖలో నిలదీశారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేక పోవడాన్ని కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితోపాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

  Krishna River Water Dispute News,krmb news,ap news,ap latest news,cm kcr news,cm ys jagan news,కృష్ణా నదీ జలాల వివాదం,కేఆర్ఎంబీ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ తాజావార్తలు,కేసీఆర్ న్యూస్,సీఎం జగన్ న్యూస్
  కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

  తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో ఆధారాలతో సహా వివరించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Godavari river, Krishna River Management Board, Pothireddypadu, Telangana

  ఉత్తమ కథలు