ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తొలిసారి మీడియా ముందుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మ కోసం ఆదివారం మహబూబ్ నగర్ వెళ్లొచ్చిన సీఎం.. సాయంత్రం అకస్మాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో వివాదాస్పదంగా మారిన వరి సాగు అంశంతోపాటు అనేక రాజకీయ చర్చలపైనా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరిని వద్దంటున్నది కేంద్రమే అని, ఢిల్లీలోని బీజేపీ ఒకలా మాట్లాడుతోంటే, సిల్లీ బీజేపీ నేతలు ఇంకోలా వాగుతున్నారంటూ స్థానిక బీజేపీ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కుక్కతో పోల్చుతూ కేసీఆర్ కామెంట్లు చేశారు. వివరాలివి..
వరి వద్దన్నది కేంద్రమే..
తెలంగాణలో వరి పంట సాగు విషయంలో అపోహలు అవసరం లేదని, ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దనే ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రాలు, దేశంలో కరువు కాటకాలు వచ్చిన సమయంలో ఫుడ్ సప్లయ్‌కి ఢోకా లేకుండా చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందన్న కేసీఆర్.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, బాధ్యతా రాహిత్యంగా ధాన్యం తీసుకోబోమని ముఖంమీదే చెబుతున్నదని సీఎం తెలిపారు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అన్నట్లుగా కేంద్రం తీరు ఉందని..
ఢిల్లీ బీజేపీ.. సిల్లీ బీజేపీ
ధాన్యం సేకరణపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఐసీ) ఎంవోయూలు చేసేందుకు కేంద్రం నిరాకరిస్తున్నదని, దీంతో ధాన్యం సేకరించిన విషయంలో రాష్ట్రాలు ఏమి చేయని పరిస్థితి ఉందని, కాబట్టే వరి పంటను సాగుచేయొద్దంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో లెవీ సేకరణ ఉండేదని.. ఇప్పుటి కేంద్రం ఆ బాధ్యతను కూడా తప్పించుకుందని సీఎం పేర్కొన్నారు. వరి సాగు, ధాన్యం సేకరణ విషయంలో ఢిల్లీ బీజేపీ తరు ఒకలా ఉంటే, స్థానిక బీజేపీ నేతలు మాత్రం సిల్లీగా మాట్లాడుతున్నారంటూ సీఎం ఫైరయ్యారు.
కుక్కలు మొరుగుతాయ్..
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ఉద్దేశించి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నానని ఆయన అన్నారు. ‘చాలా రోజులుగా బండి సంజయ్ అతిగా మాట్లాడుతున్నారు. నాపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. బండి సంజయ్ నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నా’ అని కేసీఆర్ అన్నారు.
మెడలు విరగ్గొడతాం..
బండి సంజయ్‌కి బాధ్యత లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని కేసీఆర్ అన్నారు. ‘వరి కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం రాష్ట్రాల దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలనే మెలికలు పెడుతోంది. బండి సంజయ్ కేంద్రం మెడలు వంచుతారా? ధాన్యం కొంటామని కేంద్రం ఆదేశాలు ఇస్తుందా? గత యాసంగిదే 5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదు. కోటీ 70 లక్షల టన్నుల ధాన్యం రాబోతోంది. వాస్తవాలు ఇలా ఉంటే సిల్లీ నేతలు ఏది పడితే అది మాట్లాడితే ఎలా, ఈ విషయంలో బీజేపీ మెడలు వంచడం కాదు.. మెడలు విరగొడతాం కూడా’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Huzurabad By-election 2021, Paddy, Telangana, Trs