తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ... కేబినెట్లో చోటు కోసం కొందరు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ను ఈ విషయంలో మెప్పించాలని భావిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేసిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇదే రకమైన ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు చాలారోజులుగా వినిపిస్తున్నాయి. అయితే మంత్రి పదవి ఆశిస్తున్న మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ కొత్త కండిషన్ పెట్టారనే టాక్ రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీమంత్రి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను కేసీఆర్ గుత్తాకు అప్పగించారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దీంతో హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలిస్తేనే మంత్రిగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ఛాన్స్ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి ఎమ్మెల్సీగా గుత్తాకు కేసీఆర్ అవకాశం ఇవ్వడంతోనే అంతా ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల తరువాత టీఆర్ఎస్లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి... 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయలేదు.
అయితే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపిస్తానని అప్పట్లో ఆయన కేసీఆర్కు హామీ ఇచ్చారని సమాచారం. కానీ నల్లగొండలో టీఆర్ఎస్పై కాంగ్రెస్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్... ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గుత్తాకు టీఆర్ఎస్లో మంత్రి పదవి దక్కడం అనుమానమే అనే ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ గుత్తాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయన గుత్తాకు హుజూర్ నగర్ పరీక్ష పెట్టారని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Huzurnagar bypoll 2019, Nalgonda, Trs