తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. నలుగురు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ నలుగురిలో హరీశ్ రావు, కేటీఆర్ కూడా ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తారని సమాచారం. ఆ జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి రేసులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి, ఆ తర్వాత జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల్లో ఘనవిజయాలను కట్టబెట్టిన వారికి కేబినెట్ విస్తరణలో చోటు కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదు. టీఆర్ఎస్ కంచుకోట లాంటి కరీంనగర్‌తోపాటు కేసీఆర్ కుమార్తె కవిత కూడా నిజామాబాద్‌లో ఓడిపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని, పార్టీని మళ్లీ పరుగులు పెట్టించడానికి సీనియర్లకే అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. దీంతో హరీశ్ రావును పక్కనపెట్టారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మెదక్ జిల్లాలో చక్రం తిప్పారు. టీఆర్ఎస్ మీద అసంతృప్తిని బయటకు కనిపించనివ్వకుండా చూసుకున్నారు. ఇటీవల కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో కూడా హరీశ్ రావు అంతా తానై వ్యవహరించారు. ఈ క్రమంలో మళ్లీ హరీశ్ రావును మంత్రివర్గంలోకి తీసుకురావాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఆగస్ట్ మొదటివారంలో కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Harish Rao, KTR, Sabita indra reddy, Telangana, Trs