ఆంధ్రప్రదేశ్ లో గడిచిన రెండున్నరేళ్లుగా భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాజకీయంగానూ స్థిరత్వం కొనసాగించిన సీఎం వైఎస్ జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు, రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు రూపాల్లో రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలినట్లయింది. బాబాయి వివేకా హత్య కేసులో జగన్ ప్రమేయముందనే విపక్ష ఆరోపణలకు వివేకా కూతురు సూనీత వాగ్మూలం మరింత బలం చేకూర్చినట్లయింది. అమరావతి విషయంలోనూ వైసీసీ చిన్న లాజిక్ మర్చిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు అంశాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు..
ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకాందనరెడ్డి హత్య కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది. వివేకా హంతకులకు వైఎస్ జగన్ కొమ్ముకాస్తున్నారని సాక్ష్యాత్తూ ఆయన సొందరి సునీత సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇవ్వడంతో.. చార్జిషీటులో జగన్ పేరును కూడా చేర్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. వివేకా హత్య నూరుశాతం నేరపూరిత కుట్ర అని.. దీనిలో జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు సీఎం జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్‌లో చేర్చాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. నిజానికి వివేకా హత్య కూతురు వాగ్మూలం వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా ఇదే తరహా డిమాండ్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే,
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో జగన్ డొల్లతనం మరోసారి బయటపడిందని యనమల అన్నారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎక్కడైనా చట్టాలను రాజ్యాంగానికి లోబడి చేస్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తమకు బలం ఉంది కాబట్టే చట్టాలు చేస్తామని చెబుతున్నారు. నిజమే, వారికి అధికార బలం, అహంకార మదం ఉంది. కానీ ఆలోచన బలం లేదు’అని యనమల అన్నారు.
అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి యనమల ఎద్దేవా చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదని, బడ్జెట్‌ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయడమని, ఈ లాజికల్ విషయాలను సీఎం జగన్ తెలుసుకోలేరని యనమల మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Ap cm jagan, TDP, Yanamala Ramakrishnudu, Ys viveka murder case