ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థంకావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయాలపై దాడులు ఏపీలోని అధికార వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారగా.. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ,జనసేన కూటమితో పాటు టీడీపీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బీజేపీ.. ఈ పరిణామాలు తమకు రాజకీయంగా ఎంత కలిసొచ్చినా.. తమకు అదనపు బలమే అవుతుందనే భావనలో ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పరిణామాల కారణంగా బీజేపీ బలపడకుండా చూడాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో సమానంగా ప్రభుత్వం, అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ప్రభావం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఉండకుండా ఉండేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. ఆమెను క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ ఉప ఎన్నిక కోసం టీడీపీ సీనియర్ నేతల సేవలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
తిరుపతి నియోజకవర్గంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కేడర్‌కు అండగా నిలిచే నాయకులు, భరోసా ఇచ్చే నేతలు లేరని పార్టీ అధినాయకత్వం ఓ భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసేలా ఏకంగా 70 నుంచి 80 మంది సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి ఎంత మేరకు ఓట్లు వచ్చాయనే అంశం.. ఆ పార్టీపై ఎక్కువగా ప్రభావం చూపనుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ నుంచే బలమైన పోటీ ఉండాలని.. తమ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్న బీజేపీ,జనసేన కూటమికి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని టీడీపీ అధినేత పట్టుదలగా ఉన్నారు. అలా జరగాలంటే పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే తిరుపతి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. సంక్రాంతి ముగిసిన వెంటనే కీలకమైన గ్రామాలు, మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ అధినేత నిర్ణయించారని.. ఈ మేరకు పార్టీలోని పలువురు నేతలకు సమాచారం కూడా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tirupati Loksabha by-poll