హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరోసారి బాలయ్య తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య తన అభిమాని చెంపపై చేయి చేసుకోవడం మరోసారి వైరల్ అయ్యింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. అయినా ఆయన ఆవేశం తగ్గడం లేదు. మరోసారి తన ఫ్రస్టేషన్ బయటపెట్టారు.
ప్రస్తుతం హిందూపురంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల నుంచి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకుంటూ ప్రచారంలో అన్నీ తానై దూసుకుపోతున్నారు.. అంతా సవ్యంగా సాగుతోంది. అనుకున్న సమయంలో మరోసారి క్షణికావేశంలో బాలయ్య రెచ్చిపోయారు.
మున్సిపల్ ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. ఓ అభిమాని వీడియో తీశాడు. అది గమనించిన బాలయ్య ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ అభిమాని చెంప చెళ్లుమనిపించారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్న వారు కూడా బాలయ్య కోపాన్ని కంట్రోల్ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఆ అభిమానికే.. వీడియో డిలీట్ చేయాలి అంటూ సర్ధి చెప్పుకున్నారు.
అయితే బాలయ్య అభిమానిపై ఇలా చేయ చేసుకోవడం కొత్త కాదు. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువే. గతంలో కూడా రెండుసార్లు అభిమానులపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఆయన పద్ధతి మారడం లేదని.. నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోను ట్రోల్ చేస్తున్నారు..
మరోవైపు ప్రచారంలో ఉన్నఆయన హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలను విమర్శిస్తూ.. వారికంటే తాను ఎక్కువ బూతులే తిట్టగలను అన్నారు. తనలా బూతులు ఎవరూ తిట్టలేరని.. మంత్రులు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. తనకు వారిలా ఒక పనే లేదన్నారు. చాలా పనులున్నాయని గుర్తు చేశారు. తాను ప్రజా సేవ చేస్తున్నానని, ఎవరైనా విమర్శిస్తే ఊరుకోనని చెప్పారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా ఉంటూ పేద వర్గాలకు చేదోడుగా ఉంటున్నాను అన్నారు. సినిమాల్లో నటిస్తూ ప్రజలకు మంచి సందేశాత్మక చిత్రాలు తీస్తున్నట్లు చెప్పారు. తనకు సంస్కారం ఉందని.. అందుకే గౌరవిస్తున్నానని.. నోరు పారేసుకుంటే ఊరుకోనని హెచ్చరించారు. ఇలా తనకు సంస్కారం ఉందని చెప్పిన కొన్ని గంటల్లోనే అభిమానిపై చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో హిందూపురంలో ప్రత్యర్థులకు మరో అస్త్రం దొరికినట్టైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap local body elections, Bala Krishna, Bala Krishna Nandamuri, Balayya, Hindupuram, Municipal Elections