ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం అభ్యర్థుల్లో అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఫలితాలు వెలువడటానికి మరికొద్ది వారాల సమయం ఉండటంతో... పోలింగ్ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేసుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ ఎలా జరిగింది ? ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు పడ్డాయి ? అందులో మనకు వచ్చే ఓట్లు ఎన్ని ? అనే అంశంపై ప్రధాన పార్టీల నేతలు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య... తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.
అయితే ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య ఎన్నికల వార్ హోరాహోరీగా ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో... హిందూపురంలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై పార్టీ నేతలతో బాలకృష్ణ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బాలకృష్ణ రెండు రోజులపాటు నియోజకవర్గంలో మకాం వేశారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఆయన నివాసంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతర్గతంగా నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలతో ఈ నెల 11న జరిగిన పోలింగ్ సరళిపై ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంలోని 2,29,262 ఓటర్లకుగాను 1,77,903 ఓట్లు పోలింగు కాగా 77.60 శాతం పోలింగ్ నమోదయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Hindupur S01p20, TDP, Ysrcp