హోమ్ /వార్తలు /national /

కక్ష సాధింపుకే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు: సీఎం రమేష్

కక్ష సాధింపుకే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు: సీఎం రమేష్

టీడీపీ నేత సీఎం రమేష్

టీడీపీ నేత సీఎం రమేష్

ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందునే టీడీపీపై కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, సుజనా చౌదరి సంస్థలపై ఈడీ దాడులు ఇందులో భాగమేనని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ధ్వజమెత్తారు.

  ప్రతిపక్షాలపై కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం పావులా వాడుకుంటోందని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులపై స్పందిస్తూ సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందునే టీడీపీపై కేంద్రం కక్షగట్టిందన్నారు. అందుకే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రం కుటిల ప్రయత్నాలు చెల్లుబాటు కాదని ఆయన అన్నారు.

  బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ అందరినీ ఏకం చేస్తుండటంతో వారికి నిద్ర పట్టడంలేదన్నారు. కక్ష సాధింపుతోనే సుజనాచౌదరి సంస్థలపై ఈడీ దాడులు చేయించి, ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం చేపడుతున్న కక్షసాధింపు చర్యలన్నిటినీ న్యాయబద్దంగా ఎదుర్కొంటామని సీఎం రమేష్‌ తెలిపారు.

  గత నెల రెండో వారంలో సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం తెలిసిందే.

  Published by:Janardhan V
  First published:

  Tags: CM Ramesh, IT raids, Sujana Chowdary, TDP

  ఉత్తమ కథలు