హోమ్ /వార్తలు /national /

Muncipal elections: విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థి ఫిక్స్ ! ఆ రెండు పార్టీలతో పొత్తు ఫైనల్

Muncipal elections: విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థి ఫిక్స్ ! ఆ రెండు పార్టీలతో పొత్తు ఫైనల్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

విశాఖ మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్ చేసింది. శనివారం మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థి ఎవరు? ఏఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అన్న విషయాలపై పార్టీ కేడర్ కు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు మరిచిపోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా విశాఖపై ఈ సారి టీడీపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత సాధరణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అయినా విశాఖ నగరంలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. కొందరు నేతలు పార్టీ మారిన నగరంలో ఇప్పటికీ తమకు పట్టుంది అంటున్నారు టీడీపీ నేతలు. దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తమకు కలిసి వస్తోందని భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషి అనేది విశాఖ ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయానని.. శాంతిభద్రతలు గాడితప్పాయనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇవన్నీ తమకు కలిసి వచ్చే అంశాలే అని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

టీడీపీ నేతలు చెబుతున్నట్టు విశాఖలో పరిస్థితి అంత అనుకూలంగా మాత్రం కనిపించడం లేదు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని సీఎం జగన్ నిర్ణయిస్తే టీడీపీ అడ్డుకుంటోందని.. ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీన్నేఅధికార పార్టీ ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలి అనుకుంటోంది. మరోవైపు టీడీపీ తరుపున నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు నెగ్గినా ఇప్పటికే వాసుపల్లి గణేష్.. జగన్ కు జై కొట్టారు. గంటా శ్రీనివాసావు పేరుకు పార్టీలో ఉన్నా.. ఆయన పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీనికి తోడు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. కార్పొరేటేర్ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తోంది. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా భుజానవేసుకుని వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు ఆయా వార్డుల్లో బలంగా వున్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కీలకంగా వ్యవహరించే వార్డు స్థాయి నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకునేలా వ్యూహాలు అమలుచేస్తున్నారు. తాజాగా 14వ వార్డు కార్పొరేటర్‌గా నామినేషన్‌ వేసిన టీడీపీ రెబెల్‌ అభ్యర్థి బాక్సర్‌ రాజుతోపాటు 46వ వార్డు, 50 వార్డుల నుంచి పలువురు వార్డు స్థాయి టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ ప్రతికూల పరిస్థితులను దాటాలి అంటే దూకుడు పెంచాలనీ టీడీపీ భావిస్తోంది. అందుకే గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నగర టీడీపీ నేతలు రెండు రోజుల కిందటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన...పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి అనుమతి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అవగాహన మేరకు గాజువాక ప్రాంతంలో రెండు, నగరంలో ఒకటి లేదా రెండు సీట్లు వామపక్షాలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉక్కు నగర పరిసరాలతో కూడిన 98వ వార్డు సీపీఎంకు, గాజువాకలోని 72వ వార్డు సీపీఐకి కేటాయించాలని సూత్రప్రాయంగా టీడీపీ నిర్ణయించింది. 98వ వార్డు నుంచి సీపీఎం నేత గంగారావు, 72వ వార్డు నుంచి సీపీఐ నేత ఎంజే స్టాలిన్‌ సతీమణి పోటీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే నగరంలోని 45వ వార్డును సీపీఎంకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక్కడ అభ్యర్థిగా గౌరీష్‌ పేరు పరిశీలిస్తున్నారు. దీనిపై సీపీఎం, సీపీఐ నేతలతో అచ్చెన్నాయుడు చర్చించే అవకాశం ఉంది. ఇరుపక్షాలకు అంగీకారం కుదిరితే వామపక్షాలకు కేటాయించిన వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగవలసి ఉంటుంది. అలాగే మిగిలిన వార్డుల్లో వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుని టీడీపీ అభ్యర్థులను బలపరచవలసి ఉంటుంది. కాగా 2007 ఎన్నికలలో టీడీపీ, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. అప్పట్లో నగరంలో వామపక్షాల అభ్యర్థులు రెండుచోట్ల గెలిచారు.

ఇప్పటికే విశాఖ నగరంలో కొన్ని డివిజన్లలో నెలకొన్న అంశాలపై అక్కడి నేతలతో అచ్చెన్నాయుడు చర్చించారు. విశాఖ నగరంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ పార్టీ మారడంతో ఆ నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజన్లలో పార్టీ అభ్యర్థుల మార్పు అవసరమైంది. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా ఒక అభ్యర్థి విషయంలో సమస్య ఉండడంతో పరిష్కారంపై దృష్టి పెట్టారు. గణేశ్‌ నియోజకవర్గానికి తాత్కాలికంగా అచ్చెన్న, వెలగపూడి రామకృష్ణ బాధ్యులుగా వ్యవహరించాలని నిర్ణయించారు. గంటా నియోజకవర్గంలో ఆయనకు తోడుగా నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బాధ్యత అప్పగించారు. విశాఖ కార్పొరేషన్‌కు మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే కాకి గోవింద్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నగర నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం కూడా జరిగినట్టు తెలుస్తోంది.

పిలా శ్రీనివాసరావుకు మేయర్ ఛాన్స్ ఇస్తే.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వర్గం వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ అవకాశం రాలేదని బాధపడకుండా అంతకంటే కీలకమైన పదవిని కట్టబెట్టాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన సబ్బవరం మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులను గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాబ్జీకి సముచిత స్థానం కల్పించాలని అధిష్థానం నిర్ణయించినట్టు సమాచారం.

First published:

Tags: Ap local body elections, CPI, CPM, TDP

ఉత్తమ కథలు