హోమ్ /వార్తలు /national /

Brother Anil: వైఎస్ షర్మిల భర్త ‘బ్రదర్ అనిల్‌’ మెడకు చుట్టుకుంటున్న వివాదం

Brother Anil: వైఎస్ షర్మిల భర్త ‘బ్రదర్ అనిల్‌’ మెడకు చుట్టుకుంటున్న వివాదం

బ్రదర్ అనిల్ కుమార్ (Image; Twitter)

బ్రదర్ అనిల్ కుమార్ (Image; Twitter)

ఏపీ సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ ‘బ్రదర్ అనిల్‌’ మెడకు వివాదం చుట్టుకుంటోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద జరిగిన దాడులకు సంబంధించి విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్‌ను అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ఇతర మతాలను కించపరిచేలా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా., తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల విగ్రహాలను కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు. ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.

    అయితే, ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు.

    డీజీపీ కామెంట్లపై ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ మండిపడుతున్నాయి. ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ కార్యకర్తలు కూడా గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోతే ఆయన్ను క్రిమినల్ లా ప్రకారం విచారణ జరపాల్సి వస్తుందని, అలాగే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

    మరోవైపు ఏపీ మాజీ హోంమంత్రి, టీడీపీ నేత చినరాజప్ప డీజీపీ తీరుపై మండిపడ్డారు. ‘ముందు రోజేమో సంఘవ్యతిరేక శక్తులు చేశారన్నారు. ఆ తర్వాత రోజే డీజీపీ మాట మార్చి టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడులు చేశారని అంటున్నారు. ప్రవీణ్ చక్రవర్తి ఏడాది క్రితం వీడియో పెడితే ఇప్పుడు కేసు పెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రవీణ్ చక్రవర్తికి సీఎం జగన్ బావ అయిన బ్రదర్ అనిల్‌తో సంబంధాలు ఉన్నాయి. అవి ఏ సంబంధాలో చెప్పాలి. జిల్లాలో మంత్రి కన్నబాబు, ఇతర ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఉన్నాయి. అవి ఏం సంబంధాలు. ఇవన్నీ పక్కన పెట్టి డీజీపీ మాత్రం టీడీపీ, బీజేపీ మీద తోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. బ్రదర్ అనిల్ విషయాన్ని కూడా బయట పెట్టాలి. సీఐడీ, సీబీఐ విచారణ వేయాలి. ప్రవీణ్ చక్రవర్తి ఎవరు? ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి? మతమార్పిడులను పెంచి పోషిస్తున్నాడా? అన్నీ విచారణ జరపాలి.’ అని చినరాజప్ప డిమాండ్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP Temple Vandalism, Tdp

    ఉత్తమ కథలు