అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలతో సంబధం లేకుండా దేశంలో పెట్రోల్, డీజిట్ ధరలు ఎడాపెడా పెరిగిపోవడం, భారీ బాదుడుకు స్పల్ప ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేయడం, ఆ వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రలు సైతం పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గించడంతో బీజేపీ యేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో చిచ్చురాజుకుంది. ప్రధానంగా దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలున్న ఆంధ్రప్రదేశ్ లో వ్యాట్ తగ్గించాలంటూ ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలకు సిద్దమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ది ముమ్మాటికీ తుగ్లక్ పాలనే అంటూ నిప్పులు చెరిగారు..
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, రూ.10మేర తగ్గించిన తర్వాత, అనేక రాష్ట్రాలు సైతం పెట్రో ధరలు తగ్గించాయని, ఏపీలో మాత్రం ధరలు ఎందుకు తగ్గడంలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పెట్రో ధరల అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలున్న రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై అధికార పక్షాన్ని ఉద్దేశించి ‘బాదుడే బాదుడు..’అని ఆందోళనలు చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానన్న జగన్ ఇప్పుుడేమో బాదుడులో ‘బాద్ షా’లా తయారయ్యారని ‘అప్పుడు ఏం చేప్పారు...ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారు?’అని చంద్రబాబు నిలదీశారు. జగన్‌ది ముమ్మాటికీ తుగ్లక్ పాలనే అని, అధికారం ఉందికదాని అధిక ధరలతో ప్రజలను బాదుతున్నారని మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందన్నారు. ఏపీలో పెట్రోల్ పై రూ.16, డీజిల్ పై రూ.17 వ్యాట్ తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్ పాలన అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, నిరసనలపై ఉక్కుపాదం మోపుతూ పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినాసరే టీడీపీ భయపడబోదని, పెట్రో ధరలపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊళ్లలో పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతామని చంద్రబాబు తెలిపారు.
పెట్రోల్‌పై రకరకాల పన్నులు వేయడం ద్వారా ప్రజల నుంచి అత్యధికంగా డబ్బు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని, డీజిల్‌పై అత్యధిక పన్నులు విధించే విషయంలో ఏపీ దేశంలోనే రెండోస్థానంలో ఉందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో వాహన రాకపోకలకు ఆంక్షలు ఉన్న సమయంలోనూ పెట్రోల్, డీజిల్ అ మ్మకాల ద్వారా ప్రభుత్వం రూ.11,014 కోట్లు వసూలు చేసిందని, అకారణంగా రూ.4, రోడ్ల నిర్వహణ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నదని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే వ్యాట్ పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం అమలవుతోందని, వీటిని వెంటనే తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP News, Chandrababu Naidu, Diesel price, Petrol Price, TDP