విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయాన్ని పరిశీలనకు వెళ్లతున్నట్లు ప్రకించిన వెంటనే.., వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థం చేరుకున్న ఆయన.., కొండెక్కి ఆలయాన్ని దర్శించారు. ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐతే విజయసాయి రెడ్డి రాకను టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయం చేయడానికే విజయసాయి రెడ్డి వచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
విజయసాయి కారుపై రాళ్లదాడి
విజయసాయి రెడ్డి కొండదిగి వచ్చిన తర్వాత ఆయన వాహనంలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈక్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో కూడా దాడికి పాల్పడ్డారు.మరోవైపు విజయసాయి రెడ్డిని కొండపైకి అనుమతించి తమను ఎందుకు అనుమతించలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబును విజయనగరంలోని పోలీసులు అడ్డుకున్నారు. విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయంలోకి వెళ్లిన సమయంలో చంద్రబాబును అనుమతిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశముండటంతో విజయనగంరోనే ఆయన్ని నిలిపేశారు. విజయసాయి రెడ్డి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ కి పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు.
మరోవైపు శ్రీరాముడిపై దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దోషులను శిక్షించేవరకు రామతీర్థం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమను ఆలయంలోకి వెళ్లనీయకుండా రాజకీయ నాయకులను అనుమతించడంపై స్వామిజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆలయంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులు ఐదుగుర్ని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐతే విగ్రహ ధ్వంసం ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విచారణ పేరుతో తీసుకెళ్లిన పోలీసులు తమ వారు ఎక్కడున్నారో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరిబాబు ఎలాంటి తప్పు చేయలేదని వెంటనే విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Hindu Temples, Vijayasai reddy