హోమ్ /వార్తలు /national /

Vizag steel plant:వైసీపీ రహస్య ఒప్పందంలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. భగ్గుమన్న కార్మిక సంఘాలు

Vizag steel plant:వైసీపీ రహస్య ఒప్పందంలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. భగ్గుమన్న కార్మిక సంఘాలు

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో 100 శాతం ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. అయితే ఇదంతా వైసీపీకి తెలిసే జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే పార్లమెంట్ లో ఆ పార్టీ ఎంపీలు మౌనం వహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఇంకా చదవండి ...

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేయడంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆందోళనలు చేపట్టాయి. దీంతో కూర్మానపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు ఈ పాపం వైసీపీదే అంటూ టీడీపీ విమర్శిస్తోంది.

వైసీపీ రహస్య ఒప్పందంలో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందని.. అందుకే ఆ పార్టీ మౌనంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. డిల్లీలో రహస్య మంతనాలు, గల్లీలో దొంగనాటకాలు ఆడుతున్న వైసీపీని విశాఖ ప్రజలు గుర్తించారన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ని జగన్ ప్రవేట్ వ్యక్తులకు దానం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

సీఎం జగన్ తన కేసుల మాఫీ కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయం నేడు పార్లమొంట్ సాక్షిగా బట్టబయలైందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రే స్వయంగా చెప్పారన్న విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఇన్నాళ్లు డ్రామాలాడిన వైసీపీ నేతలు ఇప్పుడు రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి మాట్లాడేటపుడు కనీసం ఒక్క ఎంపీ అయినా ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై పోరాడుతాం, కేంద్రాన్ని నిలదీస్తామంటూ గల్లీలో ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎంపీలు నేడు పార్లమెంట్ లో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మీ మౌనం రహస్య ఒప్పందానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. 32 మంది బలిదానాలతో వేలాది మంది రైతుల త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేట్ పరం చేసి.. కార్మికుల జీవితాలను రోడ్డున పడేసి, విశాఖ జిల్లా ప్రజల భవిష్యత్ పై దెబ్బగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరుల త్యాగాలంటే వైసీపీకి లెక్కలేదని? గల్లీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్రలు చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడెందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ర్ట ప్రయోజనాలు కాపాడలేని మీకు మంత్రి పదవులు ఎందుకని నిలదీశారు. నిజంగా వైసీపీ మంత్రులకు సిగ్గుంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేతకానితనంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిగ్గనిపించటం లేదా అని అచ్చెన్న నిలదీశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక అర్ధరాత్రుళ్లు పోస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు జరిపి వాటాలు పంచుకున్నారని.. ఇప్పుడేమీ తెలియనట్లు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ప్రత్యేకహోదా తేకపోగా తన చేతకానితనంతో ఉన్న పరిశ్రమలు, కంపెనీలు అమ్మేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు..

మరోవైపు కేంద్రం ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భగ్గుమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కూర్మన్నపాలెం దగ్గర రోడ్డుపై కార్మికులు బైఠాయించడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్మికులు ఒక్కసారిగా పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ వైఖరి మారదు అంటోంది. తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని ప్రధానికి సీఎం ఇప్పటికే లేఖ రాశారని... మరి ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగింది కాబట్టే చంద్రబాబు కిమ్మనడం లేదన్నారు బొత్స. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.

First published:

Tags: Andhra Pradesh, AP News, TDP, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant, Ycp

ఉత్తమ కథలు