హోమ్ /వార్తలు /national /

టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన... కోదండరాం పోటీపై సస్పెన్స్

టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన... కోదండరాం పోటీపై సస్పెన్స్

టీజేఎస్ చీఫ్ కోదండరాం(File)

టీజేఎస్ చీఫ్ కోదండరాం(File)

టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీజేఎస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యేంతవరకు ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగనుంది.

  కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో... ఇప్పుడు అందరి దృష్టి కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌పైనే నెలకొంది. మహాకూటమిలో భాగంగా 8 సీట్లలో పోటీ చేయబోతున్న మహాకూటమి పోటీ చేయబోయే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా... కొన్ని స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మంగళవారం రాత్రి నాటికి టీజేఎస్ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నా... మంగళవారం సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని బుధవారం ఈ జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

  మరోవైపు టీజేఎస్ తరపున కోదండరాం పోటీ చేస్తారా లేదా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ తమ మొదటి జాబితాలో చోటు కల్పించలేదు. దీంతో కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమే అని అంతా అనుకున్నారు. అయితే తనకు మొదటి జాబితాలో చోటు కల్పించకపోవడంపై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసిన పొన్నాల... జనగామ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించడంతో... మరోసారి కోదండరాం పోటీ ఎక్కడి నుంచి అనే చర్చ మొదలైంది.

  కోదండరాం పోటీ చేస్తారని ప్రచారం జరిగిన రామగుండం, మంచిర్యాల, జనగామ, వరంగల్ వెస్ట్ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు ఖరారు కావడంతో...ఆయన తమకు కేటాయించిన మరే ఇతర నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉండి ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సైతం కోదండరాంను ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని కోరిన నేపథ్యంలో... ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

  ఇదిలా ఉంటే టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగ మరింతగా రగిలే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీజేఎస్‌కు కేటాయిస్తారని ప్రచారంలో ఉన్న మల్కాజ్ గిరి టికెట్‌పై కాంగ్రెస్‌లో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించగానే... కాంగ్రెస్‌లోని ఆశావాహులు రచ్చ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi

  ఉత్తమ కథలు