కర్నూలులో హైకోర్టుతో పాటు రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి జేఏసీ నేత్రుత్వంలో విద్యార్థులు నేడు కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కర్నూలులో హైకోర్టు కోసం గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులు కూడా విద్యార్థులతో జతకలిశారు. దీంతో విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని.. త్వరలోనే సీఎం జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు.రాయలసీమలో హైకోర్టు,రాజధాని ఏర్పాటుపై ఇప్పటికే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని.. రాబోయే రోజుల్లో ప్రజలందరితో కలిసి రోడ్డెక్కుతామని అన్నారు. గత 3 నెలల నుంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.
భవిష్యత్‌లో అమరావతి,ఢిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షలు చేస్తామన్నారు. రాయలసీమకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు జగన్‌ను ఒప్పించి హైకోర్టు,రాజధాని ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటనలు చేసి.. ఆ తర్వాత మాయ మాటలతో తప్పించుకోవద్దన్నారు. ఎన్జీవోలు సైతం తమతో పాటు కలిసి వస్తారని.. అవసరమైతే పెన్ డౌన్ చేస్తారని అన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు తప్పవని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Kurnool, Rayalaseema, Ys jagan, Ysrcp