రాహుల్ గాంధీతో అమరీందర్ సింగ్ రాజా వారింగ్(పాత ఫొటో)
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నియమితులయ్యారు. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్పీ నేత)గా ప్రతాప్ సింగ్ బజ్వా నియమితులయ్యారు.
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్త శక్తి అందించేలా అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నియమితులయ్యారు. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్పీ నేత)గా ప్రతాప్ సింగ్ బజ్వా నియమితులయ్యారు. ఈ మేరకు సోనియా గాంధీ ఆమోదంలో నియామకాలు జరిగినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో శనివారం రాత్రి ఒక ప్రకటన వెలువడింది.
పంజాబ్ పీసీసీగా అమరీందర్ రాజా వారింగ్, సీఎల్పీ నేతగా ప్రతాప్ బజ్వాలతోపాటు పంజాబ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి భరత్ భూషణ్, అసెంబ్లీలో డిప్యూటీ సీఎల్పీ నేతగా ఎమ్మెల్యే రాజ్ కుమార్ లను నియమించారు. పంజాబ్ ఎన్నికలలో పార్టీ పరాజయం తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత కొత్త చీఫ్ నియమితులు కావడం గమనార్హం.
జాతీయ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ మళ్లీ యాక్టివ్ అయి, పలు రాష్ట్రాల నేతలతో వరుసగా సమావేశాలు జరుపుతుండటం తెలిసిందే. సెప్టెంబర్ లో జరుగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీనే మళ్లీ పగ్గాలు చేపడతారనే అంచనాల నడుమ తాజా నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం తెలిసిందే. 92 సీట్ల భారీ మెజార్టీతో ఆప్ అధికారంలోకి రాగా, 18 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 3, బీజేపీ 2, బీఎస్పీ 1, స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.