POLITICS SONIA GANDHI ANNOUNCES CONGRESS FOOTMARCH IN CONGRESS CHINTAN SHIVIR PVN
Sonia Gandhi : టార్గెట్ 2024..దేశవ్యాప్తంగా పాదయాత్ర..కాంగ్రెస్ అధినేత్రి సంచలన ప్రకటన
సోనియాగాంధీ (ఫైల్ ఫోటో)
Sonia Gandhi Announces Congress Footmarch : కాంగ్రెస్ పార్టీ తిరిగి దేశంలో అధికారంలోకి వచ్చే లక్ష్యంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. పార్టీ బలోపేతానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆదివారం సోనియా గాంధీ తెలిపారు.
Sonia Gandhi Announces Congress Footmarch : కాంగ్రెస్ పార్టీ(Congress) తిరిగి దేశంలో అధికారంలోకి వచ్చే లక్ష్యంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. పార్టీ బలోపేతానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆదివారం సోనియా గాంధీ తెలిపారు. దీని పేరు "భారత్ జోడో యాత్ర" అని తెలిపారు. భారత్ జోడో పేరుతో జరిగే ఈ పాదయాత్ర గాంధీ జయంతి రోజున(అక్టోబర్-2) ప్రారంభమవుతుందని చెప్పారు. చింతన్ శిబిర్‌లో చర్చించిన అంశాలపై కీలక విషయాలు ఈ సందర్భంగా సోనియా గాంధీ(Sonia Gandhi) వెల్లడించారు.
రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ చింతన్ శిబిరం (Congress Chintan Shivir)చివరి రోజున పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొని అభిప్రాయాన్ని తెలిపిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు ఇంత మంది నేతలతో సమయం వెచ్చించడం.. నా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది అని సోనియా అన్నారు. చింతన్ శిబిర్ మంచి ఫలితాల సాధన దిశగా సాగిందన్నారు. నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి నేతలకు అవకాశం వచ్చిందన్నారు. ఆరు కమిటీల చర్చల్లో హాజరై తాను కూడా పలు సూచనలు చేశానని.. పలువురు చేసిన ప్రతిపాదనలను తెలుసుకోగలిగాను అని సోనియా అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు కొత్త ఉషోదయం రానుందని సోనియా గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ..భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తుందని సోనియా చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి ఈ పాదయాత్ర సాగుతుందని సోనియా స్పష్టం చేశారు. కార్మికులంతా ఈ యాత్రలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు దాడికి గురవుతున్న రాజ్యాంగంలోని ప్రధాన విలువలను పరిరక్షించడం కోసం, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తిచూపడమే యాత్ర యొక్క ఉద్దేశ్యం అని సోనియా అన్నారు. వృద్ధులు, యువకులు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు యాత్ర దోహదపడుతుందని సోనియా అన్నారు.
దీంతో పాటు జిల్లా స్థాయిలో కూడా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు సోనియా చెప్పారు. జూన్ 15 నుంచి కాంగ్రెస్ రెండో విడత జన జాగారణ్ యాత్ర మొదలవుతుందని సోనియా తెలిపారు. నిరుద్యోగం ప్రధాన అస్త్రంగా జనజాగరణ్ యాత్ర సాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఉదయ్ పూర్ లోని చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో టాస్క్ఫోర్స్పై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ సమస్యలు, సవాళ్లపై చర్చించడానికి వర్కింగ్ కమిటీ నుంచి ఒక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సలహా మండలి క్రమం తప్పకుండా సమావేశమై రాజకీయ అంశాలపై పార్టీ ప్రెసిడెంట్‌కు తగిన సూచనలు, సలహాలు ఇస్తుందన్నారు. సీనియర్ నేతల అపారమైన అనుభవాన్ని పొందడంలో కూడా ఈ సలహామండలి సహాయకారిగా ఉంటుందన్నారు. సంస్థాగత మార్పులకు సంబంధించిన నివేదిక తక్షణమే అమల్లోకి రావాల్సి ఉందని... ఆ కమిటీ ఇచ్చిన వివరణాత్మక సిఫార్సులు స్వీకరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా,నేతలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ సైలెంట్ జోక్ వేశారు. "మనమంతా ఇందులో (పాదయాత్ర) పాల్గొంటాము. సీనియర్లు నాలాంటి సీనియర్లను ఇందులో ఉంచడానికి మార్గాలను వెతకాలి... ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా యాత్రలో సులభంగా ఎలా పాల్గొనాలనే దానిపై మార్గాలను వెతకాలి"అని సోనియా సరదాగా అన్నారు.
చింతన్ శివిర్ కార్యక్రమం చివరి రోజున అనేక ప్రధాన సంస్కరణలతో కూడిన 'నవ్ సంకల్ప్' ముసాయిదాను కాంగ్రెస్ నాయకత్వం ఆమోదించింది. ఇందులో ఒక కుటుంబం, ఒకే టిక్కెట్ అనేది అత్యంత ప్రముఖమైనది. దీనితో పాటు కనీసం ఐదేళ్లు సంస్థలో పని చేస్తేనే కుటుంబంలోని ఇతర సభ్యులెవరైనా టిక్కెట్టు పొందుతారని షరతు కూడా పెట్టారు. చింతన్ శివిర్‌లో కాంగ్రెస్ యువతపై ఎక్కువ దృష్టి పెట్టింది.
అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోనే తమ పోరాటం అని, అందుకే అది అంత సులువు కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ భావజాలం దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. తన ప్రియమైన దేశంలో ఇంత కోపం, హింస చెలరేగడాన్ని అంగీకరించడానికి తాను సిద్ధంగా లేను అని ఆయన అన్నారు. నేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయాలంటే షార్ట్ కట్స్ ఉండవని తెలిపారు. ఈ పోరాటంలో తుదిశ్వాస వరకు వెంట ఉంటానని నేతలు, కార్యకర్తలకు రాహుల్ భరోసా ఇచ్చారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.