విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోక్ సభలో విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానగా కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో రాష్ట్రానికి సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఆమె సమాధానంతో ప్రైవేటీకరణ తప్పదని తేలిపోవడంతో విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు నిర్విరామంగా ఆందోళనలు కొనసాగించాయి కార్మిక సంఘాలు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తమ నిర్ణయాన్ని మార్చుకున్నంత వరకు ఆందోళనలు తగ్గవని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. కూర్మన్నపాలెం దగ్గర రోడ్డుపై కార్మికులు బైఠాయించడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 36 గంటలకు పైగా జాతీయ రహదారిని కార్మికులు నిర్బంధించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని.. ఉక్కు ఫ్యాక్టరీనీ కాపాడుకునేందుకు ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. రాజకీయ నేతలను సైతం నిర్బంధిస్తామని హెచ్చరించారు.
ఉక్కు అధికారులను సైతం ఆరు గంటల పాటు నిర్బంధించాయి కార్మిక సంఘాలు.. అక్కడితోనే ఆగలేదు. కూర్మన్నపాలెంలో 36 గంటల పాటు జాతీయ రహదారిని నిర్బంధించారు. దీంతో అటువైపు రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఇంతలా ఉద్యమం మరో లెవెల్ కు వెళ్లింది.. అయితే ఇప్పుడు కార్మిక సంఘాలు స్వల్ప విరామం ప్రకటించాయి..
అయితే కేవలం జాతీయ రహదారి నిర్బంధానికి మాత్రమే కార్మిక సంఘాలు విరామం ఇచ్చినట్టు ప్రకటించాయి. కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా నిరసనలను ఈ ఒక్క రోజు నిలిపిస్తున్నట్లు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రస్తుతం కూర్మన్నపాలెం కూడలి మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిర్వాసితులు, ఒప్పంద ఉద్యోగులతో పాటు సంస్థతో భాగస్వాములైన వారందరితో చర్చించి ఉద్యమాన్ని ఏ విధంగా ఉద్ధృతం చేయాలి అన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో దాదాపు నెల రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతునే ఉన్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలు సైతం అర్పిస్తాం అంటున్నారు. ఉక్కు నిర్వాసితులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శిబిరాల్లో రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant