ఏపీ వ్యాప్తంగా అత్కంత ఉత్కంఠ పెంచింది తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. మొన్నటి మున్సిపాలిటీ ఫలితాల్లో అక్కడ టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాలకు తోడు, ఎక్స్ అఫీషియల్ సభ్యుల బలంతో.. చైర్మన్ పదవి దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం రచించింది. స్వయంగా వైసీపీ మంత్రి బొత్సనే ఈ మాట అన్నారు. తాడిపత్రి చైర్మన్ పదవిని గెలుచుకునే బలం తమకి ఉందన్నారు. దీనికితోడు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓటు చెల్లదని కమిషనర్ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. తాడిపత్రి లో గెలుపు ఎవరిది అంటూ జోరుగా బెట్టింగ్ లు కూడా సాగాయి..
ఎట్టకేలకు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది.
మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో రెండు వైసీపీ ముందే ఏకగ్రీవం చేసుకుంది. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. ముందునుంచే సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం కూడా 18కి చేరింది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో టీడీపీ సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ దీపక్ రెడ్డి ఓటును తిరస్కరించడంతో పరిస్థితి ఉత్కంఠంగా మరింది. రెండు పార్టీలకు చెరో 18 ఓట్లు ఉండడంతో చైర్మన్ పీఠం ఎవరిది అన్న ఉత్కంఠ పెరిగింది. అయితే ముందునుంచి గెలుపుపై ధీమాగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్టుదల నిలుపుకున్నారు.
అటు మైదుకూరులో టీడీపీకి అత్యధిక స్థానాలు ఉన్నా.. వైసీపీ అక్కడి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలాగే తాడిపత్రిని కూడా సొంతం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు రచించింది. కానీ జేసీ బ్రదర్స్ తమకు అత్యంత పట్టున్న తాడిపత్రిలో మరోసారి సత్తా చూపారు. తనతో పాటు నెగ్గిన టీడీపీ అభ్యర్థులతో పాటు.. సీపీఐ, స్వంతంత్య్ర అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కాపాడుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. టీడీపీతో సహా ఆ ఇద్దరి సభ్యులను తన క్యాంపులోనే ఉంచుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తాడిపత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్న వైసీపీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ అవాకశం ఇవ్వలేదు.
సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థుల మద్దతుతో.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపికైనట్లు ప్రిసైడింగ్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎన్నిక ముందు వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వేరు వేరు మార్గాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు. చివరి నిమిషం వరకు టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ కౌన్సిలర్‌లతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని.. తన వ్యూహాన్ని సక్సెస్ చేసుకున్నారు. ముందు చెప్పినట్టే ఆయన తొడగొట్టి నెగ్గారు. సేవ్ తాడిపత్రి అనే నినాదామే తనను గెలిపించింది అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Ap local body elections, JC Diwakar Reddy, Jc prabhakar reddy, Municipal Elections, TDP, Ycp