హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Elections: యువ హీరో రాజకీయ ఆరంగేట్రం, తండ్రి బాటలో

Bihar Elections: యువ హీరో రాజకీయ ఆరంగేట్రం, తండ్రి బాటలో

లవ్ సిన్హా

లవ్ సిన్హా

లవ్ సిన్హా 2010లో తెరంగేట్రం చేశాడు. సాదియా సినిమాలో తొలిసారిగా వెండితెరపై మెరిశాడు. ఆ సినిమాలో హేమా మాలిని, రేఖా, రిషీ కపూర్ లాంటి లెజెండ్స్‌తో కలసి నటించాడు.

  బాలీవుడ్ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా కుమారుడు, నటుడు లవ్ సిన్హా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నాడు. 37 సంవత్సరాల ఈ యువ నటుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. బీహార్‌లోని బంకిపోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. బంకిపోరా నియోజకవర్గం పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పాట్నా సాహిబ్ నుంచే లవ్ సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా రెండు సార్లు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009, 2014 సంవత్సరాల్లో రెండుసార్లు పాట్నా సాహిబ్ నుంచి విజయం సాధించారు. లవ్ సిన్హా రేపు తన నామినేషన్ ఫైల్ చేసే అవకాశం ఉంది. బంకిపోరా అసెంబ్లీకి నవంబర్ 3న ఎన్నికలు జరిగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

  లవ్ సిన్హా 2010లో తెరంగేట్రం చేశాడు. సాదియా సినిమాలో తొలిసారిగా వెండితెరపై మెరిశాడు. ఆ సినిమాలో హేమా మాలిని, రేఖా, రిషీ కపూర్ లాంటి లెజెండ్స్‌తో కలసి నటించాడు. జేపీ దత్తా పల్టాన్ (2018) సినిమాలో లవ్ సిన్హా చివరగా కనిపించాడు.

  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి నితిన్ నవీన్‌తో లవ్ సిన్హా ఎన్నికల్లో తలపడనున్నాడు. ప్లూరల్స్ పార్టీ అధినేత పుష్పం ప్రియా చౌదరి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. పాట్నా అనేది 30 సంవత్సరాలుగా బీజేపీ కంచుకోట. పాట్నా నుంచి 2019లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశాడు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో బాలీవుడ్ షాట్ గన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే, శత్రుఘ్న సిన్హా రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలసి పోటీ చేస్తున్నాయి. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ , లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కలసి బరిలో దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీ చేస్తోంది. అందులో బంకిపోరా కూడా ఒకటి. కాయస్త సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే బంకిపోరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడానికి లవ్ సిన్హాను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Shatrughan Sinha

  ఉత్తమ కథలు