చెన్నై: తమిళ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని తమిళనాడులో అడుగుపెట్టిన దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు చిన్నమ్మ శశికళ ఎన్నికల నేపథ్యంలో ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు నుంచి తమిళనాడుకు వచ్చిన సందర్భంలో శశికళకు ఆమె అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అన్నాడీఎంకేలో శశికళ భయం మొదలైందని, ఆ పార్టీ నుంచి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళ వర్గంలో చేరబోతున్నారని ఆ సందర్భంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. శశికళ ఊహించినట్టు జరగలేదు. సీఎం పళని స్వామి వ్యూహం ముందు చిన్నమ్మ వ్యూహం బెడిసికొట్టింది. అన్నాడీఎంకే నుంచి శశికళ ఊహించినట్టుగా వలసలు లేకపోవడంతో ఆమె వర్గం డీలా పడింది.
ఇక.. ఈ నేపథ్యంలో వ్యూహాల కంటే కేడర్‌లోకి చొచ్చుకెళితేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న శశికళ ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ నెల 24న జయలలిత జయంతి కావడంతో అదే రోజున చిన్నమ్మ ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలిసింది. అదే రోజున శశికళ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు, జయలలిత పరమపదించిన తర్వాత సీఎం పదవిలో తనను కూర్చోబెట్టడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటనే విషయం పన్నీరుకు గుర్తుండే ఉంటుందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు.
పన్నీరు సెల్వం భరతుడు అయితే.. చిన్నమ్మ పక్షాల నిలిచేందుకు సిద్ధంగా ఉంటే, ఆహ్వానించేందుకు తాము రెడీ అని ఆయన ప్రకటించడం కొసమెరుపు. ఆయన అసంతృప్తితో ఉన్నారని, తమ వర్గంలోకి వస్తానంటే ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధంగా ఉన్నారని దినకరన్ చెప్పారు. బీజేపీతో శశకళ కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఎవరిపై తాము ఒత్తిడి తీసుకురాలేదని, బీజేపీతో సంప్రదింపులు జరపలేదని తెలిపారు. డీఎంకే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యమని దినకరన్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sasikala, Tamil nadu Politics, Tamilnadu