ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని నిర్ణయించిన వైసీపీ ప్రభుత్వం... ఇందుకోసం ఎంతగానో ప్రయత్నాలు చేసింది. అయితే శాససమండలిలో వ్యూహాత్మకంగా టీడీపీ దీనికి సెలెక్ట్ కమిటీతో బ్రేకులు వేసింది. శాసనమండలి మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో... విశాఖకు రాజధాని తరలింపు తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే తాజాగా వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఈ అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొన్న విశాఖలో మాట్లాడిన విజయసాయిరెడ్డి... విశాఖ రాజధాని కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు.
దీంతో ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపు అంశాన్ని గట్టిగానే పరిశీలిస్తోందనే ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే విశాఖ రాజధానిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. జనవరి 22న మూడు రాజధానుల బిల్లును శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అయితే ఆ తరువాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో అసలు సెలెక్ట్ కమిటీ ఏర్పడలేదు. అయితే టెక్నికల్‌గా సెలెక్ట్ కమిటీపై ఏ అంశంపై అయినా చర్చించి నివేదిక ఇవ్వడానికి మూడు నెలల సమయం ఉంటుంది.
అయితే ఏపీ మండలి చైర్మన్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకుని మొన్నటితో మూడు నెలలైంది. అదే రోజు విజయసాయిరెడ్డి విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన సెలెక్ట్ కమిటీ గడువు ముగింపును దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే దీనిపై అమరావతి పరిరక్షణ సమితి మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Tdp, Vijayasai reddy, Visakhapatnam, Ysrcp