Home /News /national /

POLITICS REASON BEHIND NARA LOKESH CONTEST FROM MANGALAGIRI OF ANDHRA PRADESH AK

మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ... అసలు కారణం ఇదే

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

Nara Lokesh to contest from Mangalagiri | నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ తరపున బలమైన అభ్యర్థిని నిలిపితే ఈ సీటు కచ్చితంగా తమ సొంతమవుతుందని భావించిన చంద్రబాబు... ఎవరూ ఊహించని విధంగా తన తనయుడు నారా లోకేశ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...
    టీడీపీ తరపున బరిలో ఉండబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... తన కుమారుడు లోకేశ్ పోటీ చేయబోయే సీటు విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. పెనమలూరు నుంచి లోకేశ్ పోటీ చేస్తారని ఒకసారి... చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి పోటీ చేస్తారని మరోసారి ఊహాగానాలు వచ్చాయి. భీమిలి నుంచి లోకేశ్ పోటీ దాదాపుగా ఖాయమైందని కొద్ది రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. అయితే ఇలాంటి ఊహాగానాలకు చెక్ చెప్పిన చంద్రబాబు... ఫైనల్‌గా తన తనయుడు లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.

    నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి లోకేశ్ బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమిపాలైన గంజి చిరంజీవి కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నప్పటికీ... ఆయన పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు అంత సుముఖంగా లేవని పార్టీలో చర్చ జరుగుతోంది. మంగళగిరి కేంద్రంగా ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు లోకేశ్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు... ఐటీ పరిశ్రమలు మంగళగిరికి రావడంలో లోకేశ్ పాత్ర కీలకమనే చెప్పాలి. మరోవైపు వైసీపీ తరపున మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటం కూడా లోకేశ్‌కు కలిసొచ్చే అంశమని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆళ్లకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని టీడీపీ సర్వేలో తేలిందని... టీడీపీ తరపున బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే గెలుపు ఖాయమని చంద్రబాబుకు సమాచారం వచ్చిందని టాక్. ఈ కారణంగానే లోకేశ్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.




    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు